చనిపోయినవారి వేలిముద్రలతో కేసు--కేటీఆర్‌

ఆర్యవైశ్య సమాఖ్య అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు.ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు సొంత ఇంటి ఓట్లు కూడా పడవని,ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి ఉత్తుత్తి హామీలని, ఆయన చెప్పేవి చేయడానికి ఆరు రాష్ట్రాల బడ్జెట్‌ సైతం సరిపోదని ఎద్దేవాచేశారు.తెలంగాణకు ఆగర్భశత్రువైన ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌ ముసుగేసుకొని మళ్లీ వస్తున్నాడని చెప్పారు.అన్ని పార్టీలు కలిసి ఒక మాయా కూటమిని ఏర్పాటు చేశాయని, ప్రజలు దానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

 

 

ప్రతీ ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ అడ్డుకునేందుకు యత్నించింది. చనిపోయినవారి వేలిముద్రలతో కేసు వేసిందని ఆరోపించారు.ఎందుకీ కేసులు? ప్రజాకోర్టులో తేల్చుకుందామని ఎన్నికలకు వెళ్లాం. ఎన్నికలకు సై అన్న కాంగ్రెస్‌ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారని కోర్టుల్లో కేసులు వేసింది.ఓట్లు ఎక్కువుంటే మాకే ఎక్కువ మెజారిటీ వస్తుంది కదా? మేమెందుకు తొలగిస్తాం? ఈ మాత్రం ఇంగీతజ్ఞానం లేదా? అని ప్రశ్నించారు.భాజపా నేత లక్ష్మణ్‌ ఇంటి కిరాయి కడతామంటున్నారు. విదేశాల్లో ఉన్న ధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున వేస్తే ప్రజలే ఆయన ఇంటి కిరాయి కడతారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 30 లేఖలు రాశారు. మహాకూటమి గెలిస్తే ఆయన ప్రాజెక్టులను కట్టనిస్తారా? అని ఆరోపించారు.రాష్ట్రంలోని పేదలందరికీ న్యాయం జరిగేలా కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. రూ.200 పింఛన్‌కే కాంగ్రెస్‌ నేతలు గొప్పగా చెప్పేవారు. తెరాస ప్రభుత్వం రాగానే పింఛను రూ.1000-1500 చేశాం.అప్పుడు రూ.200 ఇవ్వలేని వారు ఇప్పుడు రూ.2వేలు ఇస్తామంటున్నారంటే ఇది మా ఘనతేనన్నారు.