మహాకూటమి గెలిస్తే నెలకొకరు సీఎం.!!

 

ముందస్తుకు తెరలేవకముందు వరకు తెరాస వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా మాటలయుద్ధం సాగింది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి సిద్ధమవ్వడం.. కాంగ్రెస్ టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడడంతో.. ఈ మాటల యుద్ధం తెరాస వర్సెస్ మహాకూటమిగా మారింది. ఎన్నికల సమయం సమీపించడంతో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్టణంలో తెరాస నేత కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల మీద విమర్శలు గుప్పించారు.

మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని ఆరోపించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో టీడీపీకి క్యాడర్‌ లేదని.. కాంగ్రెస్‌కు లీడర్లు లేరని ఎద్దేవా చేశారు. మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ప్రకటించలేదని విమర్శించారు. కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులేనని అన్నారు. మహాకూటమి వస్తే నెలకొకరు సీఎంగా ఉంటారని.. ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేటీఆర్‌ విమర్శించారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా.. సింహం లాంటి సీఎం కేసీఆర్‌ కావాలా? అని ప్రశ్నించారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటామని కేటీఆర్ అన్నారు.