నిన్నహరీష్ రావు, నేడు కేటీఆర్!

 

తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు పారిశ్రామిక వేత్తలనీ, వ్యాపారులని, సినిమా పరిశ్రమని బెదిరించి కోట్లు పోగేసుకొంటునట్లు ఇప్పటికే చాల కధనాలు విన్నాము. తెరాస నేత హరీష్ రావు పద్మాలయా స్టూడియో యాజమాన్యం నుండి రూ.80 లక్షలు వసూలు చేసాడని ఆ పార్టీనుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కే.తారక రామరావు పేరు ఇద్దరు ఆంధ్రా రియల్టర్ ల మధ్య సెటిల్మెంట్ వ్యవహారంలోబయటకి పొక్కింది.

 

ఈ కధ హైదరాబాదులో మొదలయ్యి ఒరిస్సా వరకు సాగి విశాఖలో ముగిసింది. ఆ కధ క్లుప్తంగా ఇలా సాగింది:

 

ఆంధ్రా ప్రాంతానికి చెందిన యన్.శ్రీనివాసరావు జూబిలీ హిల్స్ లో ఉన్న తన 1200గజాల స్థలాన్ని డెవెలప్ మెంటు కోసం సుబ్బారెడ్డి అనే మరో రియల్టర్ తో ఒప్పందం చేసుకొని రూ.5కోట్లు అడ్వాన్స్ పుచ్చుకొన్నాడు. అయితే, పీకలోతు అప్పులోకి కూరుకుపోయున్న శ్రీనివాస రావు ఆ స్థలాన్ని అంతకు ముందే మరొకరికి తాక్కట్టు పెట్టి దానిపై అప్పు తీసుకొన్నాడు. కానీ, ఈ విషయాన్నీ దాచిపెట్టి సుబ్బారెడ్డికి దానిని అంటగట్టడంతో సమస్య మొదలయింది.

 

శ్రీనివాసరావు రూ.5 కోట్లు వాపసు చేయలేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో, సుబ్బారెడ్డి తనకు బాగా పరిచయమున్న కేటీఆర్ ను ఆశ్రయించాడు. కేటీఆర్ తనకు నమ్మిన బంటయిన సతీష్ రెడ్డిని పంపి శ్రీనివాసరావుని తన దగ్గిరకు రప్పించుకొన్నాడు. (డబ్బు వసూలు చేసేందుకు వారు తనను చితక బాదినట్లు శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.)

 

అయితే, శ్రీనివాసరావు దగ్గర డబ్బులేదనే సంగతి కెటీఆర్ కి కూడా అర్ధమయిన తరువాత, అప్పుడు శ్రీనివాసరావే వారికి ఒక బ్రహ్మాండమయిన ఆఫర్ ఇచ్చాడు. తాను ఒరిస్సాలో సుభాష్ అగర్వాల్ అనే కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ రోడ్డు నిర్మాణం చేసానని, అందుకు గాను అతను తనకి రూ.100 కోట్లు బాకీ ఉన్నాడని, అది గనుక తనకి తిరిగి ఇప్పించగలిగితే, సుబ్బారెడ్డి దగ్గిర తీసుకొన్న రూ.5కోట్లే కాకుండా, భారీ కమీషన్ కూడా ఇస్తానని హామీ ఈయడంతో కేటీఆర్ కి ఆశపుట్టింది.

 

ఈ భారీ వంద కోట్ల వ్యవహారం తేల్చేందుకు తన అనుచరుడు సతీష్ రెడ్డిని, అతని అనుచరులను ఒరిస్సాకి పంపాడు. ఒరిస్సా వెళ్ళిన సతీష్ రెడ్డి అతని అనుచరులు సుభాష్ అగర్వాల్ ని శ్రీనివాసరావుకి ఈయవలసిన డబ్బుకోసం బెదిరించారు. అయితే ఆయన లొంగకపోవడంతో, ఆయనని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేసారు. కానీ, ఇది తెలుసుకొన్న ఒరిస్సా పోలీసులు వారిని జీపులలో వెంబడించి పట్టుకొన్నపటికీ, సుభాష్ అగర్వాల్ ఉన్న వ్యాన్ని మాత్రం పట్టుకోలేకపోయారు. అయితే వారు ఇచ్చిన సమాచారం ప్రకారం విశాఖ పోలీసులు, నగర శివారు ప్రాంతమయిన పెందుర్తి వద్ద వారిని వెంబడించి పట్టుకోగలిగారు. ఈ కధంతా జరిగి రెండు నెలలు పైనే అయింది.

 

అప్పటి నుండి శ్రీనివాసరావు, సతీష్ రెడ్డి, అతని అనుచరులు, అందరూ కూడా ఒరిస్సా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. అయితే, కధ ఈవిధంగా అడ్డం తిరగడంతో కేటీఆర్ చల్లగా పక్కకు తప్పుకోవడంతో సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ విషయం బయట పెట్టారు.

 

ఈ కధనంతా బయట పెట్టిన ఆంధ్రజ్యోతి మీద, దాని యజమాని రాధాకృష్ణ మీద ఇప్పుడు తెరాసా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ పై జరుగుతున్న దాడి తెలంగాణా ఉద్యమంపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. తమపై చేసిన ఆరోపణలు కనుక ఋజువు చేయకపోతే రాధాకృష్ణను, ఆంధ్రజ్యోతిని కోర్టుకీడుస్తామని హెచ్చరించారు.