ప్రగతి భవన్‌కి కేటీఆర్‌ గుడ్ బై..!

 

గులాబీ దళానికి కొత్తగా యువ సారథి వచ్చారు. తెరాస ఆవిర్భావం నుంచి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్‌.. సర్వం తానే అయి అటు ఉద్యమాన్ని, ఇటు పార్టీని నడపించారు. ఇక ఆ బాధ్యతలను తనయుడు కొనసాగించాల్సి ఉంది. కొత్తగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించి కేటీఆర్‌ను నియమించగా.. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)  కేటీఆర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం పగ్గాలు అప్పగించారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీతో అధికారం అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంతోపాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోంది.

 

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ను తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్‌ అప్పగించారు. ఇక కేటీఆర్‌ కూడా తనకు అప్పటింగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఇల్లు కూడా మారాలని కేటీఆర్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు ప్రగతి భవన్లోనే ఉంటున్నారు. అయితే, అక్కడ ప్రొటోకాల్‌ సమస్య కారణంగా కేసీఆర్‌, కేటీఆర్‌లను కలవలేకపోతున్నామన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. దీనికితోడు, వారికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా కేసీఆర్‌ నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే, ఇల్లు మారాలనే ఆలోచన కేటీఆర్‌లో ఉందని అంటున్నారు.