కృష్ణా బోర్డు నిర్ణయం ప్రకటన

 

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నీటితో విద్యుదుత్పత్తి చేసే విషయంలో కృష్ణానది వాటర్ బోర్డు తన నిర్ణయాన్ని శుక్రవారం నాడు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టులో 3 టీఎంసీ నీటిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని నవంబర్ 15వ తేదీ తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన క‌‌ృష్ణా నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో ఈ అంశం మీద రెండు రాష్ట్రాలతో బోర్డు జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో శుక్రవారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బోర్డు తెలిపింది. బుధవారం నాడు జరిగిన మొదటి సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో గురువారం నాడు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాలూ ఒక నిర్ణయానికి వస్తాయని, అలా రాకుంటే మధ్యేమార్గంగా కృష్ణా బోర్డు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అందరూ భావించారు. అయితే బోర్డు మాత్రం తన నిర్ణయాన్ని శుక్రవారం నాడు ప్రకటిస్తానని తెలిపింది. ఇప్పుడు నవంబర్ 2వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం 3 టీఎంసీలు వినియోగించుకోవచ్చని నిర్ణయించింది.