కొండగట్టు భాదితులకు సాయం అందేదెప్పుడు?

 

కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ప్రమాదంలో 62 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన అందరికి తెలిసిందే.మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2.50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కానీ సంఘటన జరిగి నెలరోజులు కావొస్తున్నా బాధితులకు నేటికీ పరిహారం మంజూరు కాలేదు.ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు పధకం కింద రూ.50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉండటంతో గత నెల 19 నే  జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర సచివాలయానికి నివేదిక పంపినప్పటికీ పరిహారం మంజూరీ ఉత్తర్వులపై సీఎం సంతకం చేయాల్సి ఉండగా ఎన్నికల నియమావళి అడ్డంకిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకున్నాకగానీ నిధుల మంజూరీపై నిర్ణయం తీసుకోలేమని సీఎంఆర్‌ఎఫ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.ప్రభుత్వం భాదితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నప్పటికీ రాకపోకలకు అయ్యే ఖర్చులతో కుదేలవుతున్నారు.ఆర్టీసీ సంస్థ రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయగా మొదట చేతి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇచ్చింది.ఆర్ధిక ఇబ్బందులతో భాదపడుతున్న నిరుపేద కుటుంబాలు సాయం అందేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.