కాంగ్రెస్ లోకి కొండా దంపతులు

 

కొండా దంపతులు సొంతగూటికి చేరారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేరోజు ఆయన 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసి.. రెండ్రోజుల్లో తనకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయినప్పటికీ తెరాస నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రీసెంట్ గా ఆమె మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెరాసపై విరుచుకుపడ్డారు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ గూటికి తిరిగి చేరతారంటూ వార్తలొచ్చాయి. ఊహించినట్టుగానే కొండా దంపతులు తెరాసను వీడి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తాము బేషరతుగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు చెప్పారు. తెరాస తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తామని రాహుల్‌తో చెప్పినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహుల్‌గాంధీ మళ్లీ కలుస్తామన్నారు. మరోవైపు కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.