కారు జోరుకు కొండా బ్రేకులు?

 

తెలంగాణలో జోరు మీదున్న కారుకు కొండా దంపతుల చేరికతో బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటి వరకూ గులాబీ కండువాలు కప్పుకునేందుకు ఎగబడ్డ తెలుగు తమ్ముళ్ళు, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా పునరాలోచనలో పడినట్టు సమాచారం. వైసీపీలో కీలకంగా ఉంటూ.. జగన్ పార్టీకి అనధికార తెలంగాణా ప్రతినిధిగా వ్యవహరించిన కొండా దంపతులు.. జగన్ అన్న కోసం మానుకోట రణరంగానికి ఆజ్యం పోశారు. తెలంగాణా బిడ్డలపై బందూకులు ఎక్కుపెట్టారు. గులాబీ దళపతి తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస శ్రేణులతో యుద్ధాలకు దిగారు. సీమాంధ్ర లో జరిగే సభలకు కొండా సురేఖ ప్రత్యెక అతిథిగా హాజరయ్యేవారు.

 

జగన్ జైలులో చేరిన నుంచీ కొండా దంపతులతో విభేదాలు మొదలయ్యాయి. పార్టీ నుంచి ఏ కారణంతో బయటకు వెళ్దామా అని ఎదురు చూసిన కొండా జంటకు జగన్ సమైక్యాంధ్ర స్టాండ్ సాకుగా దొరికింది. పార్టీకి రాజీనామా చేసేసి జగన్ పై తీవ్ర ఆరోపణలకు కూడా దిగారు మురళి, సురేఖ. ఇతర పార్టీల నుచి వలస వచ్చే వారి కోసం తెరాస గేట్లు బార్లా తెరిచింది. వలసల జాతరలో కొండా దంపతులకు గులాబీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు.

 

ఇక అంటే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరిని పార్టీలో చేర్చుకున్నా రాని వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకింది. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ కొండా దంపతుల చేరికను వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ తీరును ఆయన తప్పుపట్టారు. తెలంగాణా వ్యతిరేకులను పార్టీలో చేర్చుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. కొండా దంపాతులను చేర్చుకోవడంపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.

 

నిన్న మొన్నటివరకూ మొఖం కూడా చూడకుండా గులాబీ కండువాలు కప్పేసిన కేసీయార్.. ప్రస్తుతం పార్టీలో చేరికలకు ఆచి తూచి .. బాగా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం.