జగన్ ను కలవనున్న కొండా సురేఖ

 

తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసిన కొండ సురేఖ దంపతులు, పార్టీ అధిష్టానం తమ వ్యతిరేఖ వర్గానికి చెందినవారి మాటలు విని క్రమంగా తమ ప్రాధాన్యత తగ్గిస్తుండటంతో వారిరువురూ గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తమ నలుగురు అనుచరులపై పార్టీ వేటు వేయడంతో వారు పార్టీ వీడేందుకు దాదాపు సిద్దం అయ్యారు. పార్టీ అధిష్టానం ఆఖరి ప్రయత్నంగా వారిని బుజ్జగించేందుకు మొన్న సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డిలను వారి వద్దకు పంపినప్పటికీ, వారు జగన్ మోహన్ రెడ్డితో తప్ప వేరేవారితో మాట్లాడమని తేల్చి చెప్పారు. కానీ, పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సంప్రదిములతో వారు కొంచెం మెత్తబడి ఈ రోజు విజయమ్మతో భేటీ అయ్యారు. రేపు వారిరువురూ జగన్ మోహన్ రెడ్డితో ములాఖాత్ సమయంలో కలుస్తారు.

విజయమం వారికి కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ, వారు జగన్ మోహన్ రెడ్డితో స్వయంగా మాట్లాడి ఖాయం చేసుకొన్నాకనే తమ నిర్ణయం ప్రకటించవచ్చును. వారి డిమాండ్లలో ముఖ్యంగా తెలంగాణాలో తమ వ్యతిరేఖవర్గాన్ని నియత్రించడం, తమ నలుగురు అనుచరులపై పార్టీ విదించిన నిషేధం ఎత్తివేయడం, మరి కొందరిని పార్టీలో తప్పించడం వంటి షరతులున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తేనే వారు పార్టీలో కొనసాగాలని భావిస్తున్నట్లు వారి అనుచరుల ద్వారా తెలిసింది. కానీ, జగన్ మోహన్ రెడ్డి వారి షరతులకు ఒప్పుకొంటారో లేదో రేపు వారి ములాఖాత్ తరువాతనే తెలుస్తుంది. దానిని బట్టే కొండ దంపతుల కధ ఏమలుపు తిరుగుతుందో అర్ధం అవుతుంది.