కొండా దంపతులకు పొగబెడుతున్న వైకాపా

 

గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ దంపతుల ప్రాదాన్యత క్రమంగా తగ్గుతుండటంతో వారు కూడా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారి ప్రమేయమ లేకుండా నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకం జరిగిన తరువాత, వారు తమకిక పార్టీలో స్థానం లేదని గ్రహించి, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఈ వార్తలు మీడియాలో రావడం దానిపై మీడియాలో చర్చలు జరగడంతో ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారితో పూర్తిగా తెగతెంపులకి సిద్దం అవుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారి అనుచరులయిన

పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్ రాధ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మసూద్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి మోహన్‌రావులను సస్పెండ్‌చేసింది. దీనికి ఆగ్రహించిన కొండా అనుచరుడు మరియు జిల్లా నియోజకవర్గ ఇన్-చార్జ్ శ్రీనివాస రెడ్డి మరి కొందరు పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అంతిమంగా కొండ దంపతుల నిర్ణయాన్ని బట్టి వారందరూ ఏ పార్టీలో చేరలో నిస్చయించుకోవడానికి ఈ రోజు వరంగల్ లో సమావేశం అవుతున్నారు. బహుశః ఈ వారంలోనే కొండ దంపతులతో బాటు వారి అనుచరులు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది.

 

 

ఇప్పటికే, పిల్లి సుబాష్ వంటి సీనియర్ నేతలు బయట నుండి కొత్తగా వచ్చిచేరుతున్న ఇతర పార్టీల నేతలతో ఇమడలేక క్రమంగా పార్టీకి దూరమయిపోయారు. ఇంతకాలం సేవలందించి పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసిన కొండ దంపతులు కూడా ఇప్పుడు వారి త్రోవలోనే బయటకి వెళ్ళాక తప్పడంలేదు. గమ్మతయిన విషయం ఏమిటంటే, కొండా సురేఖ దంపతులు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వారి నుండి జవాబు కోరిన కొణతాల రామకృష్ణ కూడా ఇప్పుడు దాడి వీరభద్ర రావు రాకతో అసమ్మతి స్వరాలూ వినిపిస్తున్నారు. వైకాపా అనవసర భేషజాలకు పోయి పార్టీకోసం త్యాగాలు చేసిన సురేఖ, కొణతాల వంటి వారిని పక్కన బెట్టి కొత్తవారికి పీట వేయడంతో సహజంగానే పార్టీలో అసమ్మతి మరింత పెరిగింది. అయినప్పటికీ, పార్టీ తన శ్రేణుల మీద పట్టు కోల్పోలేదని నిరూపించేందుకు క్రమశిక్షణా చర్యలుకు దిగితే అది మరింత మందిని బయటకి పంపే అవకాశం ఉంది.