దాడి కోసం కొణతాలను వదులుకొంటున్న వైకాపా

 

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలబడి, ఆపార్టీకి పాత కాపుగా పేరుబడ్డ కొణతాల రామకృష్ణ కంటే, నిన్న మొన్న తెదేపా నుంచి పార్టీలోకి దూకిన దాడి వీరభద్రరావు అంటేనే ఆ పార్టీకి మమకారం పుట్టుకొచ్చింది. కొణతాలను పక్కన బెట్టి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు దాడి వీరభద్ర రావుని పార్టీ సమన్వయకర్తగా నియామకం చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

 

తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధయిన దాడితో కలిసి పనిచేయలేమని, అందువల్ల ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని కొణతాల వర్గీయులు ఎంత బ్రతిమాలినప్పటికీ, కారణాలేవయినప్పటికీ వైకాపా అధిష్టానం ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ పార్టీలోకి స్వాగతించింది. నాటి నుండి పార్టీ కొణతాల వర్గీయులు కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అదే విధంగా పార్టీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలేవీ చేయలేదు.

 

ఇప్పుడు దాడికి కీలకమయిన బాధ్యతలు అప్పగించడం ద్వారా కొణతాల వర్గీయులను పూర్తిగా పక్కన పెట్టినట్లేనని భావించవచ్చును. గనుక, ఇంత కాలం పార్టీ సానుకూల స్పందన కోసం ఆశగా ఎదురు చూసిన కొణతాల రామకృష్ణ అతని తమ్ముడు లక్ష్మి నారాయణ, మరియు వారి అనుచరులు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉంది.

 

దాడి వీరభద్రరావు స్థానంలోకి కొణతాల రామకృష్ణ ను తెదేపా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా వారికి ఆహ్వానం ఉంది. అయితే, ఆయన తెదేపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.