ఎన్నికల్లో పోటీ చేయనంటున్న కోమటిరెడ్డి

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ అయితే పూర్తి కాలేదుగాని పొత్తు ధర్మం ప్రకారం గెలిచే వారికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది.ఈ నేపథ్యంలో అసలు ఒకే కుటుంబంలో టిక్కెట్ రావటమే కష్టం అనుకుంటే ఓ కాంగ్రెస్ నేత మాత్రం తాను చెప్పిన నేతకి కూడా టిక్కెట్ ఇవ్వాలి అంటున్నాడు.లేదంటే తాను పోటీ నుంచి తప్పుకుంటా అంటున్నాడు.ఇంతకీ ఆ నేత ఎవరంటే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్‌ నుంచి, తాను మునుగోడు నుంచి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తామని ఆయన తెలిపారు.ఒకవేళ నకిరేకల్‌ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇవ్వకపోతే తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.