కోమటి చెరువు అందాలను చూడటానికి క్యూ కడుతున్న పర్యాటకులు

 

సిద్దిపేట లోని కోమటి చెరువు మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడే కోమటి చెరువు అందాలలో తాజాగా సస్పెన్షన్ బ్రిడ్జి చేరింది. లక్నవరం వంతెన తరహాలో ఇక్కడ కూడా వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు టికెట్ కౌంటర్ ను ఇటీవల మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీంతో కోమటి చెరువుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వేలాడే వంతెన పై నడిచేందుకు చెరువుకు క్యూ కడుతున్నారు ప్రజలు. దీంతో కోమటిచెరువు నిత్యం రద్దీగా కనిపిస్తోంది.

లక్నవరం లోని సస్పెన్షన్ బ్రిడ్జి కంటే కోమటి చెరువు లోని వేలాడే వంతెన పొడవైంది. 6 కోట్ల రూపాయల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటు లోకి తీసుకువచ్చారు. కోమటి చెరువు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టిన మున్సిపల్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు అడ్వెంచర్ పార్క్ లోని పార్కింగ్ యార్డు ఆధునిక టెక్నాలజీతో ప్లాపి బ్యారియర్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రానికే రోల్ మోడల్ గా ఉన్న సిద్దిపేట ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది.