మరో 2,3 సీట్ల కోసం కాంగ్రెస్‌ను కోరతాం

 

ఎన్నికల సంఘం రీసెంట్ గా టీజేఎస్ పార్టీకి ‘అగ్గిపెట్టె’ గుర్తును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అధికారికంగా తన పార్టీ గుర్తు ప్రకటించారు. ‘అగ్గిపెట్టె’ గుర్తుతో కూడిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజేఎస్ మేనిఫెస్టో కూడా సిద్ధమైంది. మేనిఫెస్టో అంశాలను ఎలక్షన్ కమిషన్‌కు పంపుతున్నాం. ఎలక్షన్ కమిషన్ అప్రువల్ తర్వాత విడుదల చేస్తాం. మేనిఫెస్టో కాపీలను మరో మూడు రోజుల్లో ఇస్తాం అన్నారు.

'పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చాలా అనుమానాలున్నాయి. పలు దఫాలు చర్చించాం. మళ్ళీ కలవాల్సి ఉంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తుది రూపం ఇస్తాం. ఇప్పటి వరకు 10 చోట్ల పోటీ చేయాలనుకున్నాం. మరో 2,3 సీట్ల కోసం కాంగ్రెస్‌ను కోరతాం. దీపావళి నాటికి తుది నిర్ణయం తీసుకుంటాం. కూటమి కొంచెం ఆలస్యంగా ఏర్పడింది. ప్రచారం తగ్గిపోయింది. ఉమ్మడి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. నిరంకుశ పాలనకు, ప్రజల ఆంకాంక్షలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. మహాకూటమి రాజకీయ అవసరాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఉమ్మడి ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్తే పెను మార్పు జరుగుతుంది’ అని కోదండరాం అన్నారు.