కోదండరాం పోటీ చేయకుండానే డిప్యూటీ సీఎం అవుతారా?

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీకి ఆయనే నేతృత్వం వహించారు. అంతేకాదు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాంకు మంచి హోదా లభిస్తుందని అంతా భావించారు. అయితే అంచనాలు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల తరువాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్, కోదండరాంల మధ్య దూరం పెరిగింది. చివరకు కోదండరాం టీజేఎస్ పేరుతో కొత్త రాజకీయపార్టీకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు టీజేఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం టీఆర్ఎస్ ను ఓడించడం. ఇప్పటికే కేసీఆర్ ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. త్వరలో ముందస్తు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమితో టీజేఎస్ చేతులు కలిపింది.

ప్రస్తుతం మహాకూటమిలో సీట్ల కేటాయింపు గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో మహాకూటమి కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కోదండరాం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కోదండరాంకు రాష్ట్ర వ్యాప్త ఆదరణ ఉంది.. కాబట్టి ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దించి ఒకే నియోజకవర్గానికి పరిమితం చేస్తే కూటమికి నష్టం కలిగే అవకాశముందని ఈ భేటీలో నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోటీకి దూరంగా ఉంచి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో ప్రచారం చేయించాలని వారు భావిస్తున్నారట. పోటీకి దూరంగా ఉన్నంత మాత్రాన కోదండరాం రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్నికల్లో కూటమి విజయం సాధించాక ఆయనకు డిప్యూటీ సీఎం లేదా ఆ హోదాతో సమానమైన పదవి ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టీజేఎస్ అభ్యర్థులను కూడా హస్తం గుర్తుపైనే పోటీ చేయించాలని కోర్ కమిటీ భావిస్తోందని సమాచారం. కొత్త గుర్తుతో జనం అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ఈ వ్యూహం దోహదపడుతుందన్నది కోర్ కమిటీ నేతల అభిప్రాయం. తాను పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అవ్వడం.. అలాగే తమ పార్టీ అభ్యర్థులను హస్తం గుర్తుపై పోటీ చేయించడం.. వీటిపై కోదండరాం ఎలా స్పందిస్తారో చూడాలి మరి.