కేసీఆర్ రైతుల్ని మంచిగ మోసంచేసిండు: కిషన్‌రెడ్డి

 

రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీల మీద హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతుల రుణ మాఫీ విషయంలో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చెప్పని విధంగా ఇప్పుడు రుణాల మాఫీలో రకరకాల కోణాలను బయటకి తీసి మాట్లాడుతున్నారు. రైతుల రుణ మాఫీ విషయంలో రకరకాల పరిమితులు విధిస్తున్నారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆ రైతులందరి వాణిని తెరాసయేతర రాజకీయ పార్టీలు కూడా వినిపిస్తున్నాయి. రైతుల రుణాల మాఫీ విషయంలో ఇప్పుడు కేసీఆర్ మాట మార్చడమంటే రైతులను మోసం చేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల ఓట్ల కోసమే రుణమాఫీ హామీ ఇచ్చారని.. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆయన ప్రస్తుతం మాటమార్చడంపై కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2013-14 తర్వాత తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాననడం మాటమార్చడమే అని కిషన్ రెడ్డి అన్నారు.