కిరణ్ కు పోటీగా బొత్స సమావేశం

 

పీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పైకి సమైక్యవాదం చేయవచ్చు గాక. చివరికి ముఖ్యమంత్రితో కలిసి డిల్లీలో ధర్నా చేయవచ్చు గాక. కానీ అధిష్టానం, సమైక్యవాదం రెంటిలో దేనినో ఒకదానిని ఎంచుకోమంటే మాత్రం ఆయన ఖచ్చితంగా అధిష్టానంవైపే మొగ్గు చూపుతారని అందరికీ తెలుసు. అందుకే ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్న వారితో తరచు యుద్ధం చేస్తూ కనబడుతుంటారు. అయితే, తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిని విమర్శించే దైర్యం చేయలేకపోతున్నారు. కానీ, ఆయన సన్నిహితులయిన గంటా శ్రీనివాసరావు వంటి వారిని విమర్శిస్తూ పరోక్షంగా ముఖ్యమంత్రికి చురకలు అంటించే ప్రయత్నం చేస్తుంటారు.

 

కానీ ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేడో రేపో రాజీనామా చేసి బయటకి పోవడం ఖాయమని తెలుస్తోంది గనుక, "ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడూ ఇటువంటి సమయంలో రాజీనామా చేయడు, కొత్త పార్టీ పెట్టడు. పెట్టినా అందులో ఎవడూ చేరడు" అని ముఖ్యమంత్రి మీద నేరుగా, కొంచెం ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నేరుగా ఆయనకే ఒక లేఖ వ్రాసారు. నామినేటడ్  విప్  పదవులకు అధిష్టానం సూచించినవారిని కాదని, తనకు నచ్చిన వ్యక్తులను నియామకం చేయడాన్ని తప్పు పడుతూ లేఖ వ్రాసారు. ఆ పదవులను బలహీన వర్గాలకు చెందిన వారికి ఇవ్వకపోవడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు.

కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా, కొత్త పార్టీ స్థాపనపై తుది నిర్ణయం తీసుకొనేందుకు నిన్న తన సహచరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో, మరిక తను కూడా రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమయిందని భావించిన బొత్ససత్యనారాయణ, ఈరోజు సాయంత్రం తన ఇంట్లో అధిష్టానానికి విధేయులు, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖించేవారితో ఒక సమావేశం నిర్వహించ బోతున్నారు.

 

మంత్రులు కొండ్రు మురళి, రఘువీరారెడ్డి, బాలరాజు, కాసు కృష్ణారెడ్డి తదితరులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలో ఉండేదెవరో? పోయేదెవరో అందరి పేర్లతో కూడిన లిస్టు తన వద్ద సిద్దంగా ఉందని చాలా రోజుల క్రితమే ప్రకటించిన బొత్ససత్యనారాయణ, ఇప్పుడు వాళ్ళంతా బయటకి పోగానే పార్టీపై పూర్తి పట్టు సాధించి రానున్న ఎన్నికలలో చక్రం తిప్పాలని ఆశపడటం సహజమే. బహుశః అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చును. ఈ సమావేశానికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడయిన మంత్రి శైలజానాథ్ ని కూడా ఆహ్వానించడం విశేషం. ముఖ్యమంత్రి మరియు ఆయన వర్గం ఎప్పుడు పార్టీ నుండి తప్పుకోబోతున్నారో ఆయన ద్వారా తెలుసుకోవాలని బొత్స ఆశిస్తున్నరేమో!

 

ఇంతవరకు అందరూ ఒకే పార్టీలో ఉంటున్న కారణంగా బొత్స సత్యనారాయణ పెద్దగా విమర్శించలేకపోయినా, రేపు వారందరూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకి పోగానే ఆయన కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరిపై తన బాణాలు ఎక్కు బెట్టి ఇంతకాలంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన తప్పులను ఎండగట్టడం ఖాయం.