కిరణ్ కిమ్ కర్తవ్యం

 

 

...సాయి లక్ష్మీ మద్దాల

 

 

రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తను సమైఖ్య వాదినని,విభజన జరిగితే రెండు ప్రాంతాలు ఏ విధంగా నష్ట పోతాయో సవివరంగా చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను చాలా వేగవంతం చేసింది.

 

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని విభజించటానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక మార్గం ఆర్టికల్ 3. కాని సమైఖ్యంగా ఉంచాలి అని రాష్ట్ర రాజకీయ నాయకులు అనుకుంటే,అదే రాజ్యాంగం ప్రకారం సమైఖ్యంగా ఉంచటానికి కనీసం మూడు మార్గాలైన కనిపిస్తున్నాయి.


                
1) కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆంద్ర రాయలసీమ ఎం. పి  లందరు సమైఖ్య వాదులమని చెప్పుకుంటున్నారు. వారికి చిత్త శుద్ధి ఉంటె వారు రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి విభజన ద్వారా తమ ప్రాంతం ఎడుర్కొనబోయే సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించు కుంటున్నామని చెబితే,అసలే మైనారిటీలో ఉన్న ప్రభుత్వం కుప్ప కూలుతుంది. అప్పుడు ఎన్నికలకు వెళ్ళటం తప్ప కాంగ్రెస్ కు మరో మార్గం లేదు.



                
2) ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లును కేంద్రం రాష్ట్ర శాసన సభకు పంపించవలసి ఉంటుంది. పార్లమెంట్  లో బిల్లును ఆమోదింప చేసుకోవటానికి కేంద్రానికి ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఒక నెల పాటు విభజన విషయమై కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగకుండా ఆపగలిగితే 2014 ఎన్నికల లోపు ఈ ప్రక్రియ పూర్తి కాదు. అంటే సమైఖ్యానికి కట్టుబడి ఉన్నకాంగ్రెస్  ఎమ్మెల్యెలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని,రాష్ట్రం లో రాష్ట్రపతి పాలనా దిశగా తీసుకొని వెళ్ళటం లేదా శాసన సభ నాయకుని హోదాలో ముఖ్య మంత్రి శాసన సభను రద్దు చేయించి,రాష్ట్రంలో ఎన్నికలకు తెర తీయటం ద్వారా దీనిని సాధించ వచ్చు.



                
3)కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3 ని ఎలా దుర్వినియోగ పరుస్తుందో చెబుతూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ ఫైల్ చెయ్య వచ్చు. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రే కేంద్ర ప్రభుత్వం పై పిటిషన్ఫైల్ చేసినపుడు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యగా సుప్రీం కోర్ట్ లో వెంటనే విభజన పై స్టే వచ్చే అవకాసం   ఎక్కువగా ఉంటుంది.


                         
 అంటే ప్రస్తుతం సమైఖ్య వాదులం అనిచేప్పుకుంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు,ఎంపి  లు కాని,తాను కేవలం సమైఖ్య రాష్ట్రం కోసమే పోరాడుతున్నానని,తనకు తన పదవి కన్నా సమైఖ్య వాదమే ముఖ్యమని చెబుతున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాని,సీమాంధ్ర నుండి ప్రాతినిధ్యం వహిస్తూ సమైఖ్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్న రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు కానీ వారికంటూ చిత్తశుద్ది ఉంటె పైన పేర్కొన్న అంశాల పరంగా రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నుండి రాష్ట్రాన్ని  కాపాడేందుకు త్యాగాలకు సిద్దం కావాలి.