ఆంధ్రా కాంగ్రెస్‌కు ఓ ఆశాకిరణం!

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి! చరిత్రలో ఇలా శాశ్వతంగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు మాజీ సీఎం! విభజన సమయంలో ఆయన ఒక విధంగా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. కాకపోతే, ఒకవైపు తెలంగాణ జనం ఆయనని సమైక్యవాదిగా చూశారు. ఆంద్రా జనం విభజన అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీఎంగా చూశారు. ఇలా రెండు వైపులా డ్యామేజ్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్! అందుకే, గత నాలుగేళ్లుగా నిశ్శబ్ధంగా వుండిపోయారు. అయితే, తరుముకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన మరోమారు యాక్టివ్ అయ్యారు. దిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లి మరోమారు తన ఓల్డ్ బాస్… రాహుల్ ని కలవనున్నారు!

 

 

కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చేరతారా? ఇప్పుడు ఇది పెద్దగా సందేహించాల్సిన పరిణామం కాదు. దాదాపు ఖరారు అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ తో భేటీ తరువాత స్వయంగా ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, కిరణ్ చేరిక కాంగ్రెస్ కు లాభమా? కాంగ్రెస్ లో చేరిక కిరణ్ కు లాభమా? ఇవే అసలు ప్రశ్నలు!

 

 

విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఆఖరుకు స్వంత పార్టీ పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు కిరణ్. ఇప్పుడు ఆ పార్టీని, సమైక్యాంధ్ర నినాదాన్ని పక్కనపెట్టి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు! కానీ, విభజన చేసిన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? ఇది సమాధానం లేని ప్రశ్నే! తెలుగుదేశం, వైసీపీల్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీ అని కూడా అన్నారు. ఇవేవీ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి దయనీయ స్థితిలో వున్న ఏపీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇందులో ఆయన గుర్తించిన లాభం ఏంటో దేవుడికే తెలియాలి!

 

 

కాంగ్రెస్‌లో చేరిక వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కనుచూపు మేరలో పెద్ద లాభాలేం లేవు. కాకపోతే, ఆయన వల్ల పార్టీకి కొంత మేర లాభమే! మాజీ సీఎంగా ఆయనకు జనంలో కొంత గుర్తింపు వుంది. అది హస్తానికి కలిసి రావచ్చు. అయితే, చిత్తూరు జిల్లా నాయకుడైన నల్లారి ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రభావం చూపే నాయకుడేం కాదు. కాబట్టి కాంగ్రెస్ కు ఆయన వల్ల కలిగే లాభం కూడా చాలా పరిమితమే! ఇలా కిరణ్, కాంగ్రెస్ ల పునః కలయిక రాజకీయంగా ఏమంత విశేషం కాదనే చెప్పాలి!

 

 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాహుల్ గాంధీ దళం అద్భుతాలు సృష్టించే అవకాశాలు అస్సలు కనిపించటం లేదు! బీజేపీకి ఎంత గడ్డు కాలం వుందో… అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ కు కూడా ఆంద్రాలో వుంది. కాబట్టి తెలుగుదేశం, వైసీపీల జోరులో రెండు జాతీయ పార్టీలు అల్లాడిపోవటం గ్యారెంటీగానే కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన జనసేన ఎలాగూ వుండనే వుంది! మొత్తంగా ఇంకా ఓటర్ల దృష్టిలో విభజన చేసిన పార్టీగా మచ్చ పడ్డ కాంగ్రెస్ ఇప్పుడప్పుడే తేరుకునే స్థితిలో లేదు! మరి అటువంటి పార్టీలో కిరణ్ ముందు ముందు ఏం చేయనున్నారో!