ఇంతకీ కిరణ్ కొత్త పార్టీ ఎందుకు స్థాపిస్తున్నట్లు?

 

 

ఎట్టకేలకు ఈరోజు మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. మార్చి12న రాజమండ్రీలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ రోజు పార్టీ పేరు, ఇత్యాదులు వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలుగు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఘోర అవమానం జరిగిందని, వారి ఆత్మాభిమానం దెబ్బతిందని, వారికి ఉపశమనం కలిగించేందుకే పార్టీ స్థాపిస్తున్నాని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలుగు ప్రజలను వంచించాయని, అందుకే వారి తరపూన పోరాడేందుకే పార్టీ స్థాపిస్తున్నాను తప్ప పదవుల కోసమో అధికారం కోసమో కాదని తెలిపారు.

 

అయితే ఆయన కాంగ్రెస్ ని వీడి బయటకొచ్చి కొత్త పార్టీ స్థాపిస్తున్నాకూడా ఇంకా తన అధిష్టానంపై మాట తూలకుండా చాలా ఒద్దికగా, సున్నితంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. పదవులకోసం అధికారం కోసం మిగిలిన పార్టీలన్నీ ఆరాటపడుతున్నాయని విమర్శించిన ఆయన, తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయదా? గెలిచేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయదా? గెలిస్తే పదవులు, అధికారం చెప్పాట్టదా? అనే సంగతిని మరిచిపోవడం విశేషం.

 

గాయపడిన తెలుగు ప్రజల మనసులకు స్వాంతన చేకూరూస్తానని చెపుతున్న ఆయన, రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలుగు ప్రజలకు (అంటే ఆయన దృష్టిలో కేవలం సీమాంధ్ర ప్రజలు మాత్రమే) ఏవిధంగా అవమానాలు పాలయ్యారో మరో మారు పూసగుచ్చినట్లు వివరించి మానుతున్న గాయాలను మరోమారు కెలికొదిలారు. రేపు ఎన్నికలలో గెలిచేందుకు కూడా ఆయన (పార్టీ) బహుశః ఇదే మంత్రం ప్రయోగించడం తధ్యం. లేకుంటే ఆయన కొత్తగా చెప్పుకోవడానికి వేరే ఏముంది?

 

అసలు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ దేనికి? అంటే తానిప్పుడు రాజకీయ నిరుద్యోగిగా మారానని ఆయనే స్వయంగా ఇటీవల ఒక సమావేశంలో చెప్పుకొన్నారు. ఆయన వంటి మరి కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించేందుకు, సమైక్యాంధ్ర సెంటిమెంటుని, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొని ఉన్న వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొంటూనే, మిగిలిన ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీకి సహకరించేందుకు ఏర్పడుతున్న పార్టీ ఇది.

 

తనకే పదవి, అధికారం మీద మోజు ఉండి ఉంటే, మిగిలిన మంత్రులలాగ తను కూడా సోనియాగాంధీ కాళ్ళు పిసికితే సరిపోయేదని, కానీ తనకు తెలుగు ప్రజల (సీమాంధ్ర ప్రజలు మాత్రమే) కోసం ఆరటపడినందునే, అధిష్టానాన్ని కూడా ధిక్కరించి, బయటకి వచ్చి పార్టీ స్థాపిస్తున్నాని చెప్పుకొచ్చారు. మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీలో ఉండి సోనియమ్మ సేవలో తరిస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి ఆమె ఆదేశాల ప్రకారం పార్టీ నుండి బయటకి వచ్చి పార్టీ పెట్టి ఆమె ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వారు లోపలున్నారు. ఈయన బయట ఉన్నారు అంతే తేడా. ఎన్నికలు ముగియగానే ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆయనతో సహా ఆ పార్టీలో అందరూ కూడా మళ్ళీ లోపలకి వెళ్ళిపోతారు. అప్పుడు కేంద్రంలో అధికారం, పదవులు పొందుతారు. ఇదీ ఆయన కొత్త పార్టీ ప్రధాన ఎజెండా.