ఇంతకీ సమైక్య చాంపియన్ ఎవరో

 

ఇప్పుడు రాష్ట్రంలో సమైక్యవాదంపై పేటెంట్ హక్కుల కోసం గట్టి పోరాటం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరియు లగడపాటి రాజగోపాల్ ఈపోటీలో ముందున్నారు. అయితే, ఈ పోటీ ప్రధానంగా మొదటి ఇద్దరి మధ్యే ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే.

 

ఈ ఇద్దరిలో ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన అధిష్టానాన్నిదిక్కరిస్తూ సమైక్యగీతం ఆలపిస్తున్నకారణంగా సహజంగానే జనాలలో కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకొని ఈ రేసులో ముందున్నారు. మరి ఆయన నిజాయితీగానే ఈ సమైక్యగీతం ఆలపిస్తున్నారా లేక అధిష్టానం స్వరపరచిన ట్యూన్స్ పట్టుకొని పాడుతున్నారా లేక రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తన కుర్చీకి డోకా లేకుండా చూసుకోనేందుకే ఈపాట అందుకొన్నారా లేక తన నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొని నిలబడేందుకే ఈ పాట పాడుతున్నారా అనే ధర్మ సందేహాలు పక్కన బెడితే, ఆయన రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టం అవుతున్నపటికీ ఆయనే సమైక్యరాగం గట్టిగా ఆలపిస్తూ దానిపై పూర్తి పేటెంట్ హక్కులు తనవేనంటున్నారు. అయితే ఆయన పార్టీలో ఉన్నాబయటకు వెళ్లి వేరే కొత్త కుంపటి పెట్టుకొన్నాకూడా అంతిమంగా ఆయన, కాంగ్రెస్ పార్టీయే లభాపడతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి దూకుడుగానే పావులు కదుపుతున్నారు. జైలు నుండి బయటకు వచ్చీ రాగానే, తన పార్టీ ఆలపిస్తున్నసమైక్యరాగంలో మరికొన్నికొత్తరాగాలు జోడించి గొంతెత్తి పాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పాటకి కిరణ్ కుమార్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతూ శృతి తప్పిస్తున్నారు.

 

ఉద్యోగులతో కలిసి కోరస్ పాడి జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలని జగన్ ప్రయత్నిస్తే, పైలీన్ తుఫాను పేరు చెప్పి వారిని సమ్మె విరమింపజేయడంతో ఆయన ఒక్కడే ఒంటరిగా విషాద గీతం పాడుకోక తప్పలేదు. పోనీ ఆమరణ దీక్ష చేసుకొంటూ ఆయన పాడిన సమైక్య రాగాన్ని, అదొక కూనిరాగమన్నట్లు దానికి నామమాత్రంగా కూడా స్పందించకుండా నూటొక్క దీక్షల్లో ఇదీ ఒకటి అన్నట్లు తీసిపారేయడంతో వ్రతం(దీక్ష) చెడినా ఫలం దక్కకుండా పోయింది.

 

పోనీ హైదరాబాదులో ఓ ఐదు లక్షల మందిని పోగేసి వారి ముందు సమైక్యరాగం తీద్దామనుకొంటే, శాంతి భద్రతలంటూ కాలు అడ్డం పెడుతున్నాడని కోర్టుకు మోర పెట్టుకొనే పరిస్థితి కల్పించారు. పోనీ “ఇదే పాట ఇదే నోట వేరే ఊళ్ళో పదే పదే పాడుకొంటాను. కనీసం అందుకయినా నా బెయిలు షరతులు సడలించండి మహాప్రభో” అని కోర్టుకు విన్నవించుకొన్నారు.

 

ఒకవేళ కోర్టు ఆయన సీమాంద్రాలో కచేరీ చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోతే, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన జీవితాన్నే మార్చేసే ఒక సరి కొత్త ఐడియా వెంటనే అమలుచేయక తప్పదు. లేకపోతే ఇంతకాలం ఎంతో రిస్కు తీసుకొని పాడిన సమైక్యరాగం కాస్తా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మిగిలిపోతుంది. పైగా అది కాంగ్రెస్ స్వరపరిచిన గీతం కాకపోయి ఉంటే, పార్టీలోను ఆయనకు తాళం తప్పవచ్చును.

 

ఈ రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాడుతున్నది ఒకటే పాట అయినప్పటికీ వేర్వేరు రాగాలు, తాళాలు వేస్తూ ఆలపిస్తూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి జనాలు రాబోయే ఎన్నికలలో వీరి పాటకు తాళం వేస్తారో లేక ఇద్దరూ సమైక్యరాగం తీస్తూ రాష్ట్ర విభజన చేసి పెట్టినందుకు ఇద్దరికీ గోడ్రేజ్ తాళం వేసేసి, అందరి కంటే సీనియర్ సమైక్య రాగాలాపకుడయిన ఏ లగడపాటినో లేక వేరెవరినో మేళ తాళాలతో స్వాగతం పలుకుతారో చూడాలి.