కిరణ్ వర్గంలో అంతర్మథనం

 

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరవర్గంలో అంతర్మథనం మెదలైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన సొంత నియోజకవర్గం వైపు ఇప్పటివరకు క న్నెత్తి చూడలేదు. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టే సమయంలో కూడా ఆయన రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించారు తప్ప, సొంత జిల్లా అయిన చిత్తూరును పట్టించుకోలేదు. తిరుపతిలో సభ పెట్టి భారీగా పార్టీ ప్రకటించిన చిరంజీవి, చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు కాబట్టి సెంటిమెంటు పరంగా ఇక్కడ పెడితే తననూజనం అలాగే అనుకుంటారనో, ఏమో రాజమండ్రిని వేదికగా కిరణ్ ఎంచుకున్నారు. అయితే, ఆయన వెంట ఉన్న ముఖ్యనేతలంతా పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో సొంత నియోజకవర్గంలో కిరణ్ అనుచరులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంకా కిరణ్‌ను నమ్ముకుంటే తాము కూడా మునిగిపోతామనే అభద్రత వారిలో చోటుచేసుకుంది. దాంతో నెమ్మదిగా వాళ్లు కూడా వేరే దారులు చూసుకుంటున్నారు.

 

కొంతమంది టీడీపీవైపు, మరికొంతమంది వైఎస్ఆర్ సీపీ వైపు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీలేరు మండలం వేపులబైలు, జాండ్ల, రేగల్లు సర్పంచ్‌లు మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. వీరిలో జాండ్ల సర్పంచ్ శ్రీనివాసులు కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పత్తేగడలో పార్టీ మారుతున్న వారిని మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వాళ్లు పట్టించుకోలేదు. ఇప్పటివరకు పీలేరులో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి పెత్తనం చేస్తూ వచ్చారు. అన్న తరఫున పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఏ పని కావాలన్నా మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డిపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కిరణ్ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కిషోర్ కుమార్‌రెడ్డి అంతగా పట్టించుకోవడం లేదు. ఆయన కేవలం హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. ఇదే కొనసాగితే నియోజకవర్గంలో మనుగడ కష్టమనే అభిప్రాయం కిరణ్ వర్గీయులను వెంటాడుతోంది.