కిరణ్, బాబుల రుణానుబంధం

 

తాను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలు మీదనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు వాగ్దానాలు చేస్తుంటే, రుణమాఫీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోకూడా సాద్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టినటు చెపుతున్నారు. కానీ, చంద్రబాబు ఈ రోజు కూడా తన పాదయాత్రలో రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కేవలం రుణమాఫీయే మార్గం అని నొక్కి చెప్పారు. పరిశ్రమలకి, ఇతర రంగాలకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నపుడు, వ్యవసాయానికి, రైతులకు ఎందుకు సాయం చేయలేరని ప్రశ్నించారు.

 

ఈ రోజు డిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మీడియావారు ఈ విషయం ప్రస్తావించగా, ఆయన కొంచెం అసహనంతో రూ.1.16 లక్షల కోట్ల రుణాలను చంద్రబాబు ఏవిధంగా మాఫీ చేయలనుకొంటున్నారో కాస్త వివరిస్తే బాగుంటుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆపేసి ఇస్తారా లేక ఒక్క రూపాయి కేజీ బియ్యం ఆపేసి ఇస్తారా లేక పెన్షన్లు ఈయడం ఆపేసి రుణమాఫీ చేస్తారా చెప్పమంటూ ఎదురు ప్రశ్నించారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయడం కష్టంగా భావిస్తోందని, అటువంటప్పుడు చంద్రబాబు ఏవిధంగా రైతుల రుణమాఫీ చేసేస్తానని వాగ్దానాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా, చంద్రబాబుకి వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలబెట్టుకోవడం అలవాటు లేదని, అందుకే నోటికి వచ్చిన వాగ్దానాలు చేసేస్తున్నారని ఆయన విమర్శించారు.

 

దీనికి ప్రతిగా రేపు చంద్రబాబు మరింత ఘాటుగా జావాబు ఈయవచ్చును. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలిగితే ప్రజలలో ఆయన మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ, మన రాజకీయనాయకులలో ఎవరికీ కూడా అంతమంచి అలవాటు లేదు, ఉండదు కూడా.