చిత్తూరు కాంగ్రెస్ నేతలకి కిరణ్ పార్టీ వల

 

చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అయోమయం చోటుచేసుకుంది. కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది.

 

గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు.

 

కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ భేటీ అయ్యారు. మధ్యాహ్నం కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం.

 

చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిరణ్ పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది.