కిరణ్‌ ఎన్నికలలో పోటీ చేయడం లేదు

 

 

 

మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈరోజు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తారని అందరూ భావించారు. అయితే శనివారం నాడు పీలేరు నియోజకవర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో ఈసారి ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోవడం లేదన్న విషయం వెల్లడైంది. తాను సమైక్యాంధ్ర పార్టీని స్థాపించింది సీమాంధ్రకి ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరికతోనే అన్న విమర్శ ఇతర రాజకీయ పక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. తాను జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించింది తెలుగుజాతి సమైక్యంగా వుండాలనే ఉద్దేశంతోనే తప్ప సీమాంధ్రకి సీఎం అయిపోవాలన్న ఉద్దేశంతో కాదన్న సందేశాన్ని అందరికీ ఇవ్వడానికే ఆయన ఎన్నికలలో నిలబడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.