కిరణ్ మార్కు కంగాళీ!

 

రాష్ట్ర విభజన విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సృష్టించిన కంగాళీ సీమాంధ్రుల కొంప ముంచింది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చని ‘రాష్ట్ర విభజన జరగదు.. జరగదు..జరగదు’ అంటూ జనాన్ని, తన స్వంత పార్టీ నేతలనీ కూడా హిప్నటైజ్ చేసేసి ఎలాగో రోజులు దొర్లించేసారు. పాపం.. సీమాంధ్రులు కూడా ముఖ్యమంత్రి చెబుతున్నాడు కదా అని నమ్మేశారు. ఫలితం.. పిడుగులాంటి రాష్ట్ర విభజనను భరించాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ తియ్యటి మాటలతో సీమాంధ్రులను మభ్యపెట్టి రాష్ట్ర విభజన సులువుగా జరిగిపోవడానికి సహకరించారన్న అభిప్రాయం సీమాంధ్రులలో బలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించిన కిరణ్ బృందం ఇప్పటికీ రాష్ట్రం విడిపోదు అంటూ సీమాంధ్రులని మరింత అమాయకుల్ని చేసే ప్రయత్నం చేస్తోంది.

 

కానీ, ఇప్పుడు సీమాంధ్రుల ఉన్న పరిస్థితుల్లో సీమాంధ్రుల గొంతును ఢిల్లీలో వినిపించే సమర్థ నాయకత్వం కావాలి. కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వాన్ని సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడిలో చూస్తున్నారు. ఒకపక్క తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం వుందని సీమాంధ్రులను కన్ఫ్యూజ్ చేస్తూ, అంతా కంగాళీ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 

కిరణ్ కుమార్ సీమాంధ్ర ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు. కిరణ్ కుమార్ అండ్ బృందానికి సీమాంధ్రుల మీద నిజంగా అభిమానం వుంటే, జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళి ఓట్లు చీల్చి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కంటే తమ పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో చెప్పుకొంటే మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.