జగన్, కిరణ్ రెడ్డిల తెలంగాణ బాట దేనికొరకు?

 

ఇంతకాలంగా కిరణ్, జగన్ ఇద్దరూ కూడా సమైక్యాంధ్ర చాంపియన్లుగా ఎదిగేందుకు, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ చేసిన ఉత్తుత్తి వాదనలు, పోరాటాల గురించి అందరికీ తెలిసిందే. వారిరువురూ కూడా సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే ప్రయత్నంలో చేసిన వాదనల వల్ల అక్కడ ఏమీ బావుకోకపోయినా, తెలంగాణాలో అడుగుపెట్టలేని పరిస్థితి కల్పించుకొన్నారు. వారి వాదనలలో, ఆచరణలో నిజాయితీ లోపించిందని సీమాంధ్ర ప్రజలు భావిస్తుంటే, వారిరువురూ తెలంగాణాకు శత్రువులని తెలంగాణా ప్రజలు నమ్ముతున్నారు. కానీ వారిరువురిలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి మరణం తాలూకు సానుభూతి అదనపు అర్హతగా ఉంది గనుక వైకాపాకు నేటికీ సీమాంధ్రలో మంచి పట్టు ఉంది. కానీ అదేమీలేని కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి మాత్రం రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన స్థాపించిన పార్టీకి నేతలు లేక, ఆయన సీమాంద్రాలో నిర్వహించే రోడ్ షోలకు జనాలు లేక అవస్థలు పడుతున్నారు.

 

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు సీమాంద్రాలో పరువు పోగొట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో కూడా తన అభ్యర్ధులను పోటీకి దింపడం చాలా నవ్వు తెప్పిస్తుంది. కానీ అంత వ్యతిరేఖత ఉందని తెలిసి ఉన్నపటికీ, కిరణ్ కుమార్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ తన అభ్యర్ధులను తెలంగాణలో పోటీకి దింపడం దుస్సాహసమే అని చెప్పవచ్చును. కానీ సాహసం చేస్తున్నారంటే అందుకు ఎన్నికలలో పోటీ కంటే ఇంకా పెద్ద లక్ష్యమే ఉందని అనుమానించవలసి వస్తుంది.

 

కిరణ్ నేటికీ కాంగ్రెస్ అధిష్టానం వీర విదేయుడేనని చెప్పక తప్పదు. కనుక అయన తన అధిష్టానం సూచించిన ప్రకారమే తెలంగాణాలో కూడా తన అభ్యర్ధులను బరిలోకి దింపి ఉండవచ్చును. జైసపా పేరుతో అభ్యర్ధులను రంగంలో దింపడం ద్వారా అయన సాదించగలిగేవి రెండే రెండు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఓట్లలో ఎంతో కొంత చీలిక తేవడం లేదా అక్కడ ప్రజలలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి సీమాంధ్ర వ్యతిరేఖతను మరింత పెంచి పోషించి తద్వారా తెచ్చి గట్టిగా తెలంగాణావాదం చేస్తున్న కాంగ్రెస్, తెరాసలకు పరోక్షంగా లబ్ది కలిగించడం.

 

అదేవిధంగా తెలంగాణాను వ్యతిరేఖించిన జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఇప్పుడు అదే తెలంగాణాలో పోటీ చేయాలనుకోవడం చాల ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః అతను కూడా అవే కారణాలతో తన అభ్యర్ధులను బరిలోకి దింపుతున్నారేమో అనే అనుమానాలున్నాయి. అతనికి తెలంగాణాలో ఎంత వ్యతిరేఖత ఉన్నపటికీ నేటికీ కొన్ని జిల్లాలలో ఎంతో కొంత పట్టు ఉంది గనుకనే అంతమంది అభ్యర్ధులను రంగంలో దింపేరనుకొన్నా, వారు ఓట్లను చీల్చడానికే తప్ప వైకాపాని గెలిపించే అవకాశాలు లేవనే చెప్పవచ్చును.

 

అతనితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, బహుశః తన శతృవులయిన తెదేపా-బీజేపీలను దెబ్బతీసేందుకే అతనితో ఈ వ్యూహం అమలు చేయిస్తోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమయినప్పటికీ ‘ఊరక రారు మహాత్ములన్నట్లు’ ఈ ఇద్దరు తెలంగాణా వ్యతిరేఖులు ఊరకనే తెలంగాణాలో అడుగుపెట్టడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.