కిడారి కుమారునికి మంత్రి పదవి

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో గిరిజనులు లేకపోవటం తో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని చంద్రబాబు పరిశీలుస్తున్నట్టు సమాచారం.ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదోఒక సభకు ఎన్నికవ్వాలి.ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి.ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే... ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని,గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని తెదేపా వర్గాల అంచనా.