కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తిన సీఎం జగన్...

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి కేంద్రం వద్ద లేవనెత్తారు ముఖ్యమంత్రి జగన్. హోదా కేంద్రం పరిధిలోనిదేనని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను కోరారాయన. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు 838 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు తెలిపారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు రివైజ్ అంచనాలు 55,549 కోట్ల రూపాయలుగా కేంద్ర జల వనరుల శాఖ సాంకేతిక కమిటీ ఆమోదించిందని, దీనికి పరిపాలన అనుమతి వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన దానిలో కేంద్రం నుంచి రావలసిన 3360 కోట్లు ఇప్పించాలన్నారు. వెనకబడిన జిల్లాలకు గడిచిన మూడేళ్ళుగా ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రెవిన్యూ లోటు భర్తీకి సంబంధించి రావలసిన 8968 కోట్లు ఇప్పించాల్సిందిగా కోరారు. ఇటు రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. 

అటు మూడు రాజధానుల అంశాన్ని కూడా కులంకషంగా అమిత్ షాకి వివరించారు జగన్. హైకోర్టును కర్నూలుకు తరలించటానికి త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు వివరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను మండలి అడ్డుకొనే ప్రయత్నం చేసి అపహాస్యం చేసిందన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమండ్ చేసిందని మిగిలిన చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు పారిశ్రామిక ప్రగతి సాగునీటి రంగానికి సంబంధించి వీలైనంత సాయం చెయ్యాలి అని అమిత్ షాను కోరారు. అలాగే దిశ చట్టాన్ని ఆమోదించేలా చర్యలు తీసుకువాలని కోరారు. ఇవాళ కూడా జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.