మహిళా అధ్యక్షురాలికి అవమానం.... బహిరంగ సభలలో మాట్లాడరాదు...

 

ఓ పక్క మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా..మరోపక్క మాత్రం వారిపై మాత్రం చులకన భావన పోవట్లేదు. ఇలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. బహిరంగ సభలో మాట్లాడే సంప్రదాయం మహిళలకు లేదంటూ అడ్డుకున్నారు. వివరాల ప్రకారం..కేరళలోని ముస్లింలీగ్ పార్టీలో కమరున్నీసా అన్వర్ (60).. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు. అయితే  తిరువనంతపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి లేచి నిలబడగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ మయీన్ హాజీ ఆమెను అడ్డుకున్నారు. పురుషులను ఉద్దేశించి మహిళలు మాట్లాడటం సరికాదన్నారు. ఇక ఈ వార్తలపై స్పందించిన హాజీ    ''మహిళలు బహిరంగ సభలలో మాట్లాడరు. మేము మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. అందుకే వాళ్లను బహిరంగ సభలు, రాత్రివరకు జరిగే కార్యక్రమాలకు హాజరు కాకుండా ఆపుతాం'' అని ఆయన చెప్పారు. ఏదైనా ఒక బృందం వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడటానికి పర్వాలేదు గానీ, బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడకూడదని తెలిపారు.

 

ఇదిలా ఉండగా జరిగిన ఘటనపై కమరున్నీసా అన్వర్ మాట్లాడుతూ.. తాను గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, జరిగిన ఘటన పట్ల చాలా బాధపడుతున్నానని తెలిపారు.