వదంతులు ఆపండి... వైసీపీలో చేరే ఆలోచన లేదంటున్న కేఈ వర్గం!!

నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేఈ సోదరులపై సాగుతున్న ప్రచారాన్ని చూస్తే ఈ నానుడి గుర్తొస్తుంది. గత కొన్నేళ్లుగా కర్నూల్ జిల్లా టిడిపికి కేఈ కుటుంబం పెద్ద దిక్కుగా ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కేఈ క్రిష్ణమూర్తి, టిడిపి అధినేత చంద్రబాబుకు సమకాలికుడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన అనేక ఉన్నత పదవులు చేపట్టారు. టిడిపికి కష్టకాలం వచ్చినప్పుడు తెలుగుతమ్ముళ్లకు కేఈ సోదరుల వెన్నుదన్నుగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి.

2019 ఎన్నికలకు ముందు తమ చిరకాల ప్రత్యర్థి అయిన కోట్ల ఫ్యామిలీతో కూడా కేఈ బ్రదర్స్ చేతులు కలిపారు. జిల్లాలో టిడిపికి అత్యధిక సీట్లు గెలిపించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కాని మొన్నటి ఎన్నికల్లో వీచిన వైసీపీ గాలిలో అవి ఫలించలేదు. కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా టిడిపికి రాకపోయినా కేఈ కోట్ల కుటుంబాలు మాత్రం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాయి. టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాధితులకు అండగా నిలిచి స్థానిక ఎన్నికల సమయానికి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసి అధిక స్థానాల్లో పసుపు జెండా ఎగరేయాలనే లక్ష్యంతో కేఈ బ్రదర్స్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కేఈ సోదరులు టిడిపిని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలు కావడం గమనార్హం. ఈ నెలాఖరున లేదా డిసెంబరులో కేఈ క్రిష్ణమూర్తి.. ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కుటుంబాన్ని తమ పార్టీలో చోటివ్వడంతో జిల్లాలో ఆ సామాజిక వర్గాన్ని మరింత దరి చేర్చుకోవాలనే యోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

కేఈ ఫ్యామిలీని వైసీపీలోకి ఆహ్వానిస్తూ.. కేఈ కృష్ణమూర్తికి రాజ్యసభ సీటు, ఆయన తమ్ముడు ప్రభాకర్ కు మంత్రి పదవి ఇస్తారని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం తమ దృష్టికి రాగానే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై కేఈ వర్గీయులు మండిపడ్డారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిసెంబర్ మొదటి వారంలో కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా టిడిపిలో గందరగోళం సృష్టించేందుకు కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కేఈ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పై టిడిపి జిల్లా నేతలు సైతం సీరియస్ అవుతున్నారు. టిడిపిని నైతికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెరవెనకుండి ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేఈ బ్రదర్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారంపై జిల్లాలోని ఆ పార్టీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. మొత్తానికి సోషల్ మీడియాలోకి ఫ్యామిలీపై జరుగుతున్న ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మాట వాస్తవమనే చెప్పుకోవాలి.