కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీద విమర్శల వర్షం కురిపించారు. ముందుగా తెలుగులో తన ప్రసంగం ప్రారంభించిన మోదీ.. గోదావరి, మంజీరా, కృష్ణా నదులు ప్రవహించే పుణ్యభూమని, రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన భూమి ఇదని అన్నారు. నిజామాబాద్‌కు చెందిన గిరిజన పుత్రులు ఎవరెస్ట్‌ పై దేశ జెండాను ఎగరవేశారని కొనియాడారు.

నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనను ప్రజలు ప్రశ్నించే సమయమిది. వాగ్దానాలనునెరవేర్చడంలో విఫలమైన టీఆర్ఎస్ ఎండగట్టాల్సిన తరుణమిది. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన తరహాలోనే టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అభివృద్ధి చేయకుండా గెలవచ్చన్న భ్రమల్లో ఆ పార్టీ ఉంది. కాలం మారింది.. ఇక మీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని కేసీఆర్‌ చెప్పారు. కానీ నగరంలో తాగునీటికి కూడా ప్రజలు అలమటించే పరిస్థితి ఏర్పడింది. మురుగునీటి పారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలుస్తారు. కేసీఆర్ హామీలే కాదు.. పాలన కూడా పూర్తికాలం పాటు చేయలేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కలిగింది. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని వ్యక్తిని సీఎం పీఠంపై మళ్లీ కూర్చోబెడదామా?. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్న మీరు.. మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. హామీలు మర్చిపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు.. ఆత్మవిశ్వాసాన్ని నమ్మరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మంత్ర తంత్రాలను నమ్మడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌భవ పథకాన్ని ఎందుకు అమలుచేయరని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌భవ పథకంతో 3లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ బీజేపీ నినాదమని ప్రధాని అన్నారు. విద్య, ఉపాధి, ఆదాయం పెంచడం, వృద్ధులకు అండగా ఉండటం, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం బీజేపీ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.

రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే యూపీఏ సర్కారులో కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే నమ్మవద్దు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టేలా దొంగాట ఆడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో రాహుల్‌, సోనియాగాంధీ కలిసి సభలో పాల్గొన్నారు. ఓ వైపు కుమారుడు.. మరో వైపు తల్లి మాట్లాడుతూ కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ రెండు కుటుంబపార్టీలే. పార్టీల విధానాల్లో కూడా పెద్దగా తేడా లేదు. తప్పుడు ప్రచారంలో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి నేర్చుకున్న విద్యలతోనే కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు అని విమర్శించారు.