హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసిఆర్ హాజరు కానున్నారా?

 

తెలంగాణ సీఎం పైనే అందరి చూపులు.ఒక పక్క హుజుర్ నగర్ ఎన్నికల ప్రచారం,మరోపక్క ఆర్టీసీ సమ్మే. ఈ గండాలను కేసీఆర్ ఎలా దాటతారోనని అందరిలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. పార్టీ అధినేత కేసీఆర్ క్యాంపెయిన్ లో చొరవ చేసుకునే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎన్నికల సంఘం నిఘా, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె హుజూర్ నగర్ సభకు కేసీఆర్ హాజరు అవ్వాలో వద్దో తేల్చుకోలేని స్థితి  కల్పించారు.

హుజూర్ నగర్ లో నేడు అధికార టీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు పై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సీఎం వస్తారా రారా అని వారం రోజులుగా స్థానికంగా చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల్లో వ్యయం పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించడమే ఇందుకు కారణం. ఎన్నికల సంఘం షాడో బృందాలు ఈ నియోజకవర్గంలో ప్రత్యేక నిఘా వేశాయి. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్ హాజరైతే అభ్యర్థిపై ఎన్నికలపై వ్యయ ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

బహిరంగ సభకు సుమారు యాభైవేలమంది హాజరవుతారని మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో వారిని తరలించేందుకు అయ్యే ఖర్చంతా టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సైదిరెడ్డి ఎన్నికల ఖర్చు నిబంధనలోకి వచ్చే అవకాశముంటుంది.ముఖ్యమంత్రి ఇక్కడికి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళినందుకు సభావేదిక నిర్మాణం, నిర్వహణకు ఇతర వాహనాలకు అయ్యే ఖర్చులన్ని ఎన్నికల వ్యయం కిందకు వస్తాయి.

వీటిలో కొన్ని ఖర్చులు టిఆర్ఎస్ ఖాతాలోకి మరి కొన్ని స్టార్ క్యాంపెయిన్ వర్గం అయిన సీఎం ఖాతాలోకి వెళ్తాయి. ఎన్నికల వ్యయం నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరుస రోడ్ షోలు కూడా రద్దయినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మి కుల సమ్మె కొనసాగుతుండటంతో సీఎం సభలో కార్మికులెవరైనా నిరసన తెలపడం వంటి ఘటనలు జరిగితే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు.

దీంతో కేసీఆర్ రాకపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు అధికారులు మాత్రం సీఎం కేసీఆర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మాత్రం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కేసీఆర్ వస్తారా రారా అన్నదే అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.