పంచాయితీ అయిపోలేదంటున్న కేసీఆర్

 

 

 

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినన్నాళ్లూ నోటికి ఏ మాత్రం అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడిన కేసీఆర్.. మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు మాటలు మొదలుపెట్టారు. విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ కొనసాగించినన్నాళ్లు తాను మాట్లాడకుండా, మిగిలిన నాయకులను కూడా అదుపులో ఉంచిన ఆయన.. ఇప్పుడు ఎటూ పని అయిపోయింద కదా అనుకుంటున్నారో, ఏమో గానీ మళ్లీ సీమాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు.

 

ఆంధ్రాతో పంచాయితీ పూర్తిగా అయిపోలేదని, చాలా అంశాల్లో ఇంకా పోరాడి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రిటైర్డు డీజీ ఎస్.కె.జయచంద్ర, మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళీ తదితరులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనీ మాటలు చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పారు. వీటిలో పంపిణీ పూర్తయ్యేదాకా ఆంధ్రాతో పంచాయతీ పూర్తయినట్టు కాదన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలు కూడా తెలంగాణలో కలపాలని ఆయన డిమాం డు చేశారు.



‘‘పందిగూడులాగా ఒకటే గదిని కట్టించి ఇచ్చి బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో రెండు బెడ్‌రూములు, ఒక హాలు, కిచెన్, బాత్‌రూములు, మరుగుదొడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఖర్చును ఉచితంగా భరిస్తుంది. కుల రహిత వ్యవస్థ ఉండాలని చెబుతున్న ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఎందుకు పెడుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తం. అటెండరు నుండి ఐఏఎస్‌దాకా, రిక్షా కార్మికుని నుండి మంత్రుల పిల్లల దాకా అదే హాస్టళ్లలో ఉంటరు. స్విమ్మింగ్‌పూల్, విశాలమైన ఆట మైదానంతో పాటు భోజనం వంటి అన్ని వసతులను ప్రభుత్వమే నిర్దేశిస్తుంది.ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే అక్కడ ఉన్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం పోతుంది. దీనివల్ల ఉచిత నిర్బంధ విద్య కచ్చితంగా అమలు అవుతుంది’’ అని కూడా కేసీఆర్ తనదైన శైలిలో హామీలు ఇచ్చిపారేశారు.