టీడీపీని టార్గెట్ చేసిన కేసిఆర్, సోనియా!

 

కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఎన్నికలకు ముందు హటాత్తుగా విభజన అంశం భుజానికెత్తుకోవడం సహజంగానే అందరికీ అనుమానాలు రేకెత్తించింది. ఈ విభజన వల్ల రాజకీయంగా ఎవరు ఎక్కువ దెబ్బతిన్నారని ఆలోచిస్తే ‘తెలుగుదేశం పార్టీ’ అని అందరూ టక్కున జవాబిస్తారు. తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తూ ఆ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ ఆ సంగతి గట్టిగా చెప్పుకోలేక అటు తెలంగాణాలో, ఇటు సీమంద్ర రెండు ప్రాంతాలలో నష్టపోయింది. తెదేపాకు తెలంగాణా చాలా బలమయిన క్యాడర్ ఉన్నపటికీ పార్టీ అధిష్టానం కానీ, పార్టీలో తెలంగాణా నేతలు గానీ వారికి దైర్యం చెప్పి అండగా నిలబడకపోవడంతో ఇదే అదునుగా తెరాస తమ పార్టీలోకి వలసలు ప్రోత్సహించింది.

 

తెలంగాణాలో తెదేపాను దెబ్బతీయడం తెరాసకు ఎంత అవసరమో కాంగ్రెస్ కి కూడా అంతే అవసరం. కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు యంపీ సీట్లు కావాలి. కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అయ్యేందుకు తెరాసకు యం.యల్యే. సీట్లు కావాలి. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా చేసుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకొనేందుకు గట్టిగా పట్టు బట్టిందని అందరికీ తెలుసు. కానీ, తెరాసను విలీనం చేసుకొని తెలంగాణాలో బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాను విడిచిపెట్టడం శత్రుశేషమే అవుతుంది. కనుక ఆ ప్రయత్నంలో తెరాసపై గట్టిగా ఒత్తిడి తెచ్చి తెదేపా నేతలని, క్యాడర్ ని పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసింది. అయితే, ఎక్కడా తన పాత్ర బయటపడకుండా తనలో విలీనం కాబోతున్న తెరాసనే ముందుంచి పని కానిచ్చేయాలని ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశానికి చివరి వరకు నొక్కిపడుతూ అనేక ట్విస్టులు ఇస్తూ ప్రజలనే కాదు తెరాసను దాని అధ్యక్షుడు కేసీఆర్ ని సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టినా కూడా అది ఆమోదం పొందుతుందో లేదో తెలియని పరిస్థితులు కల్పించడంతో ఎవరికీ తల వంచని కేసీఆర్ సోనియాగాంధీ ముందు సాగిలపడినంత పని చేయడం అందరికీ తెలిసిన విషయమే.

 

ఆ రెండు పార్టీల మధ్య తెదేపా నలిగి నష్టపోయింది. కానీ వారు ఆశించినట్లుగా తెలంగాణాలో తెదేపాను మాత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో తెరాస కాంగ్రెస్ లో విలీనం అయిపోతే, ఇక తెలంగాణాలో తెదేపా తప్ప మరో బలమయిన ప్రతిపక్షం ఉండదు. ఇదే అదునుగా తెదేపా-తెలంగాణ నేతలయిన ఎర్రబెల్లి, రావూరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రమణ తదితరులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి గట్టిగా, పట్టుపడితే నేటికీ తెదేపా మళ్ళీ బలపడి పూర్వ వైభవం పొందే అవకాశం ఉంది.

 

రాష్ట్ర విభజన వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశ్యం తెలంగాణాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడమే కానీ తెదేపాను బలపడేలా చేయడం కాదు. కనుకనే, అంతవరకు ఒకరినొకరు కౌగలించుకొన్నంత పనిచేసిన కాంగ్రెస్-తెరాసలు అకస్మాత్తుగా శత్రువులుగా మారిపోయి విలీన ఒప్పందం తెంచేసుకొని ఉండవచ్చును. ఇప్పుడు కాంగ్రెస్-తెరాసలు వేర్వేరుగా తెదేపాలో బలమయిన నేతలకి, ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి వారికి టికెట్స్ ఆశ చూపి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయవచ్చును.

 

తెదేపా-తెలంగాణా కమిటీ వేసిన తరువాత, పార్టీ సారధ్య బాధ్యతల కోసం, తెలంగాణా అధ్యక్ష పదవి కోసం ఎలాగూ పార్టీలో లుకలుకలు మొదలయ్యే అవకాశం ఉంది గనుక, అదే అదునుగా ఆ రెండు పార్టీలు టికెట్స్ ఎరగా వేసి వలసలను ప్రోత్సహించి తెదేపాను పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చును. మరి ఇంతవరకు అనేక అగ్ని పరీక్షలు ఎదుర్కొన్న తెదేపా ఈ అంతిమ పరీక్ష ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడవలసి ఉంది.