వరప్రసాద్ రెడ్డికి కేసీఆర్ శిరస్సు వంచి నమస్కారం

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వ్యక్తికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. శాంతా బయోటెక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డికి. భారతదేశంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కృషి చేసి విజయం సాధించి, ప్రజానీకానికి చాలా తక్కువ ఖర్చుతో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా చేసిన వరప్రసాద్ రెడ్డికి ఇప్పటికీ ఎంతోమంది శిరసు వంచి నమస్కారం చేస్తూ వుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేశారు. కాకపోతే ఇందులో వెరైటీ ఏంటంటే, వరప్రసాద రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. కేసీఆర్ శిరసు వంచి నమస్కరించడం అంటేనే చాలా గొప్ప విషయం అనుకుంటే, ఆయన్ని కేసీఆర్ పొగిడిన విధానం మాత్రం చాలా చాలా గొప్పగా వుంది. ఈ అరుదైన అద్భుత సంఘటన గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగింది.

 

హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ దగ్గర శాంతా బయోటెక్స్ ఆధ్వర్యంలో ఇన్సులిన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం గురువారం నాడు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వరప్రసాద్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘శాంతా బయోటెక్స్ వరప్రసాద్ రెడ్డి చాలా గొప్ప పారిశ్రామికవేత్త. ఆయనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మంచి పనులు ఎవరు చేసినా వారి మీద మనకు మంచి అభిప్రాయమే వుంటుంది. ఎన్నో మంచి పనులు చేసిన ఆయనను నేను అందుకే గౌరవిస్తున్నాను. వరప్రసాద్ రెడ్డి లాంటి ప్రతిభా పాటవాలు, పట్టుదల, కమిట్‌మెంట్, దీక్షతో వుండేవారు ఈ రోజుల్లో కనిపించడం లేదు. దేశంలోని కొన్ని కోట్ల మందిలో ఆయన లాంటి వారు ఒక్కరుంటారు. వరప్రసాద్ రెడ్డి గారు ఆయన కుటుంబంతో కలసి మా ఇంటికి ఒక్కసారి భోజనానికి రావలసిందిగా కోరుతున్నాను. వరప్రసాద్ రెడ్డిగారూ.. మీలాంటి వారితో కలసి భోజనం చేయడం మాకు గర్వకారణం అవుతుంది’’ అన్నారు.

 

నిఖార్సయిన దొరగారు కేసీఆర్ నోటివెంట ఇలాంటి మాటలు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వరప్రసాద్ రెడ్డి గురించి కేసీఆర్ నోటి వెంట వచ్చిన ప్రతి మాటా నిజమే అయినప్పటికీ, అలాంటి మాటలు కేసీఆర్ నోటి వెంట రావడమే అందరి ఆశ్చర్యానికి కారణమైంది. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం కేసీఆర్ మాటలకు భాష్యాలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు పారిశ్రామికంగా పెట్టుబడుల అవసరం ఎంతో వుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రాంతం వారు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రాంతానికి చెందిన వరప్రసాద్ రెడ్డిని ప్రశంసించడం ద్వారా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని, ముఖ్యంగా ఆంధ్ర పెట్టుబడిదారులను తాను ఎంత గౌరవిస్తారో కేసీఆర్ తన మాటల ద్వారా అంతర్లీనంగా చెప్పేశారు. ఊరకే పొగడరు మహానుభావులు అంటే ఇదేనేమో!