మజ్లిస్‌, తెరాస అధినేతల భేటీ

 

తెలంగాణ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ తెరాస కు తమ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. రేపు ఫలితాలు వెలువడనుండటంతో సీఎం కేసీఆర్‌ నేడు మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ తో భేటీ కానున్నట్లు సమాచారం. తాజాగా అసద్..కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారు. ‘‘సార్‌! మళ్లీ మీరే సీఎం. మెజారిటీ స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మీ వ్యూహం ఫలించింది. ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుంది. మెజారిటీకి అవసరమైన వాటి కంటే ఎక్కువ స్థానాలే మీకు వస్తాయి.’’ అంటూ అసదుద్దీన్‌..కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సరళి, పోలింగు ఇతర అంశాలపై చర్చించుకున్నారు. మజ్లిస్‌ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం, తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో తెరాసకు సానుకూల ఫలితాలు వస్తాయని అసద్‌ వెల్లడించినట్లు సమాచారం. 

ఎన్నికల్లో తెరాస అఖండ విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మైనారిటీలు, అన్ని వర్గాల ప్రజలు తమను ఆదరించారని పోలింగు ద్వారా రుజువైందన్నారు. ‘‘రాష్ట్రమంతటా గులాబీ హోరే వినిపించింది. ప్రజలు తెలంగాణ స్వాభిమానాన్ని చాటారు. మేం ఊహించిన విజయాన్ని అందుకుంటాం. మళ్లీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఎక్కడా కూటమి జాడ లేదు. ఒక్కస్థానం గెలుస్తామని కాంగ్రెస్‌, తెదేపాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి.’’ అని అసద్‌తో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.