తెరాస కొంపముంచుతున్న రుణమాఫీ

 

కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీలపై వెనకడుగు వేయడంతో కేవలం ప్రతిపక్షాలే కాక స్వంత పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకాలం ఎవరినిపడితే వారిని నోటికి వచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ మరియు ఆయన మంత్రివర్గ సభ్యులకు, ఇప్పుడు తమను ప్రతిపక్షాలు జాడించి వదిలిపెడుతుంటే ఆ కష్టం ఏమిటో బాగా తెలిసివస్తోంది. ఎన్నికల సమయంలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14 సం.లలో లక్షరూపాయలలోపు తీసుకొన్న వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు తాకట్టుపెట్టి తెచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేమని అప్పుడే తేల్చి చెప్పేయడంతో, తీవ్ర ఆగ్రహం చెందిన కొందరు తెరాస కార్యకర్తలు ఆర్మూరు మండలంలో మందని గ్రామంలో తెరాస జెండా దిమ్మను కూల్చి వేసారు. అదేవిధంగా మాచారెడ్డి మండలంలో కూడా తెరాస జెండా దిమ్మను కూల్చి వేసినట్లు తాజా సమాచారం. ఇక నిజామాబాద్ జిల్లాలో గాంధారి గ్రామంలో మాతు సంఘం రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా, రుణాలన్నిటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లమీడకు వచ్చి ధర్నాలు చేసారు.కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుడే తీవ్ర ఒత్తిడి మొదలయినట్లు కనబడుతోంది.

 

ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ఉద్యోగులను కేసీఆర్ వెంట తిప్పుకోగలిగారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం నడపడం మొదలు పెట్టేసరికి, ఇంతవరకు వెంట నడిచిన ప్రజలే ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. కేసీఆర్ మొదటి హామీపై వెనక్కి తగ్గితేనే ఇంత రగడ మొదలయింది. ఆయన ఇంకా చాల చాలా హామీలు ఇచ్చారు. వాటి విషయంలో కూడా ఇలాగే వెనక్కు తగ్గినట్లయితే మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ‘కేసీఆర్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ళ పండుగ’ అని తెదేపా నేత రేవంత్ రెడ్డి మొదటిరోజే అనేసారు.