హుస్సేన్ సాగర్ని మంచినీటి సరస్సు చేస్తాం...

 

హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయాలు, వినోద కేంద్రాలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ అంశం మీద సీఎం కేసీఆర్ బుధవారం నాడు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగర్ ఒక వరమని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. హుస్సేన్ సాగర్‌ను మంచినీటి చెరువుగా మారుస్తామని ఆయన చెప్పారు.