కేసీఆర్ హెలికాప్టర్ పైలెట్ మాయం...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనకు అన్నీ సీరియస్ టాస్క్‌లే. ఎప్పుడూ ఉరుకులూ పరుగులే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఆటవిడుపులాంటి వెరైటీ సందర్భం ఎదురైంది. ఆయన హెలికాప్టర్ పైలెట్ కేసీఆర్ కాసేపు కుదురుగా ఒకచోట కూర్చునేలా చేశాడు. బుధవారం నాడు కేసీఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత బోయినపల్లి వెంకట రామారావు అంత్యక్రియలకు హాజరై, నివాళులు అర్పించడానికి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కి వెళ్ళారు. తాను వెళ్ళిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని హెలికాప్టర్ దగ్గరకి తిరిగి వచ్చిన కేసీఆర్‌కి అక్కడ హెలికాప్టర్లో తనకోసం వెయిట్ చేస్తూ వుండాల్సిన పైలెట్ మాత్రం కనిపించలేదు. పైలెట్ ఎక్కడకి వెళ్ళాడా అని ఎంక్వయిరీ చేస్తే అక్కడున్న అధికారులు ఎవరికి వారు మాకు తెలియదు.. మాకు తెలియదు అని చెప్పేశారు. అప్పుడేం చేయాలో అర్థంకాని కేసీఆర్ హెలికాప్టర్‌ ఎక్కి కూర్చున్నారు. ఆయన పైలెట్ కోసం పావుగంటకు పైగా హెలికాప్టర్లోనే వెయిట్ చేశారు. ఇంతకీ పైలెట్ ఎక్కడికి వెళ్ళాడా అని అధికారులు ఎంత వెతికినా అతని జాడ కనిపించలేదు. దాంతో అక్కడున్న వారికి రకరకాల అనుమానాలు కూడా వచ్చాయి. ఇలా ఓ ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత హెలికాప్టర్ పైలెట్ కర్చీఫ్‌కి చేతులు తుడుచుకుంటూ వచ్చి, ‘‘సార్‌ ప్రోగ్రాం లేటవుతుందేమోనని టిఫిన్ చేయడానికి వెళ్ళా’’ అని చల్లగా చెప్పాడు. దాంతో అక్కడున్నవాళ్ళందరూ పైలెట్ని భలేవాడివయ్యా అనేశారు. అయితే కేసీఆర్ మాత్రం పైలెట్ మీద ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయపోవడం వెరైటీ.