కాంగ్రెస్ ఎత్తుకి కెసిఆర్ చిత్తయ్యాడా!

 

కాంగ్రెస్ నేతలకి వలేసిపట్టుకొందామనుకొన్న కేసీఆర్ తానే ఇప్పుడు కాంగ్రెస్ గాలానికి చిక్కుకొని విలవిలలాడుతున్నాడు. తమ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడుతుంటే, దానికి ఏవిధంగా స్పందించాలో అర్ధంకాక రెండురోజులు మౌనంగా ఉండిపోయిన ఆయన, “కాంగ్రెస్ మాటలు వింటుంటే నిజంగానే తెలంగాణా ఇస్తుందేమోననిపిస్తోంది. కానీ దాని గత చరిత్ర చూస్తే, ఇదికూడమరో కొత్తనాటకమనిపిస్తుంది. ఏమయినప్పటికీ, కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే మాకొచ్చిన నష్టం ఏమి లేదు. అప్పుడు తెలంగాణా నిర్మాణం కోసం మేము మరో కొత్త ఉద్యమం మొదలుపెట్టవలసి ఉంటుంది. మా ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, మేము కాంగ్రెస్ లో విలీనం కావలసిన అవసరం కూడా ఉండదు. కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని నాకయితే నమ్మకం లేదు,” అని అన్నారు.

 

గత పదేళ్ళ బట్టి కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు తెలంగాణా ఇవ్వబోతోందో జోస్యం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే తెలంగాణా ఇస్తానని చెపుతుంటే నమ్మలేకబోతున్నాడు. ‘కాంగ్రెస్ మాటలు నమ్మాలో లేదో అర్ధం కావట్లేదని’ మొట్ట మొదటిసారిగా ఆయన నిజాయితీగా ఒప్పుకోవడం విశేషం. ఇక, ‘తమ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, తమ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని’ చెప్పడంలోనే, ఆయన నష్టపోయానని ఒప్పుకొంటున్నారు.

 

ఉద్యమాలు జోరుగా నడుస్తున్నపుడు, కాంగ్రెస్ కి ఆయన షరతులు, హెచ్చరికలు జారీచేసే పరిస్థితిలో ఉండేవారు. తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాదులో ప్రశాంతత ఉండాలంటే కాంగ్రెస్ ఆయనను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనని, ఆయన పార్టీని పక్కన బెట్టి, తెలంగాణాపై తానే స్వయంగా నిర్ణయం తీసుకొంటుంటే, ఆయన ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.ఇది వరకు తెరాసను విలీనం చేయమని కాంగ్రెస్ వెంటబడితే, ఇప్పుడు కేసీఆరే స్వయంగా విలీనం గురించి మాట్లాడుతుండటం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.

 

అయితే, పరిస్థితులు ఎల్లపుడు అటు కాంగ్రెస్ పార్టీకో, ఇటు తెరసకో అనుకూలంగా ఉంటాయని అనుకోవడం అవివేకం. ఒకప్పుడు తెరాసది పైచేయి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హస్తం పైనుంది. అందువల్ల రాజకీయాలలో ఎప్పుడు, ఏ కారణం చేతయినా పరిస్థితులు తారుమారవవచ్చును. అంతవరకు కేసీఆర్ ఓపికగా ఎదురుచూడగలడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.