మున్సి-పోల్స్‌పై కేసీఆర్ పరేషాన్... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో వెనుకంజ

ఒకవైపు ఆర్టీసీ సమ్మె... మరోవైపు విపక్షాల మూకుమ్మడి దాడి చేసినా హుజూర్‌నగర్ బైపోరులో మంచి విజయం సాధించడంతో గులాబీ బాస్ పట్టలేని ఆనందంతో కనిపించారు. హుజూర్ నగర్ సక్సెస్ ఊపులోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి విపక్షాలను చిత్తుచిత్తుగా ఓడిద్దామంటూ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకే, ఎప్పుడైనా మున్సిపోల్స్ కు సిద్ధంగా ఉండాలని అటు అధికారులకు, ఇటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అయితే, ఆ స్పీడ్ ఇప్పుడు కనిపించడం లేదట. అసలిప్పుడు మున్సిపోల్స్‌కు వెళ్లాలా? వద్దా అనే అయోమయంలో పడ్డారని అంటున్నారు.

హుజూర్ నగర్ విజయంతో మాంచి జోష్ మీదున్న కేసీఆర్ కి షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారట గులాబీ లీడర్లు. హుజూర్ నగర్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించకపోయినా... స్టేట్‌ వైడ్ గా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్‌ ఉంటుందని కేసీఆర్ కి రిపోర్ట్స్ ఇచ్చారట. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మున్సిపోల్స్ కు వెళ్తే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊహించని నష్టం జరిగే ప్రమాదముందని కేసీఆర్ కి సూచించారట. హుజూర్ నగర్ బైపోల్‌ వేరు... మున్సిపల్ ఎన్నికలు వేరని... ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే అది మరింత తీవ్రంగా ఉందంటూ జనాగ్రహాన్ని కేసీఆర్ కి నివేదించారట. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నేతలు యాక్టివ్ పనిచేస్తుండటంతో... అర్బన్ ఏరియాస్ లో ఆ పార్టీకి ఆదరణ పెరిగిందని రిపోర్ట్ ఇవ్వడంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు.

వరుస ఎన్నికలు-వరుస విజయాలతో దూకుడు మీదున్న టీఆర్ఎస్‌... మున్సి-పోల్స్‌పై మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ విజయంతో గులాబీ బాస్‌ ఎన్నడూలేనంత జోష్‌లో కనిపించినా.... గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తో మున్సిపల్ ఎన్నికలపై పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకకుండా మున్సిపోల్స్ కు వెళ్తే మాత్రం పార్టీకి ఊహించని నష్టం జరగడం ఖాయమని పార్టీ లీడర్లు తేల్చిచెప్పడంతో కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నారట. దాంతో, ఆర్టీసీ ఇష్యూ ముగిసిన తర్వాతే మున్సిపల్ పోరుకి వెళ్లాలని నిర్ణయించారట.