ఇద్దరు సీఎంలు 15 ఏళ్ళు దిగ్విజయంగా పరిపాలించాలి: స్వరూపానందేంద్ర స్వామి

 

 

విజయవాడలో ఈరోజు శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి నియామక కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వామి స్వరూపానందేంద్ర శిష్యుడు కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలు అప్పగించే ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మరియు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అగ్నిసాక్షిగా చెబుతున్నాను, నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఏపీ సీఎంపై తన ఆప్యాయతాను చాటుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ అని స్వామీజీ పేర్కొన్నారు. కేసీఆర్ మంచి మనసున్న వ్యక్తి అలాగే గొప్ప మేధావి అని అలాగే మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్ అంటూ స్వామీజీ వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తనకు ప్రాణసమానులని పేర్కొన్న శారదా పీఠాధిపతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వచ్చి ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఆస్వాదించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. తెలుగునాట అధర్మం ఓడి ధర్మం గెలిచింది అని చెప్పడానికి ఈ ఇద్దరు రాజులే నిదర్శనం అని జగన్, కేసీఆర్ లను ఉద్దేశించి స్వామీజీ వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరూ 15 ఏళ్లు దిగ్విజయంగా రెండు తెలుగు  రాష్ట్రాలను పరిపాలించాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.