ముందే విషం చిమ్మిన కేసీఆర్

 

 

 

రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఒకవేళ తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ ప్రాజెక్టులు నిండితేనే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లిస్తామని కుండ బద్దలుకొట్టేశారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు తమతమ ప్రాంతాలకు వెళ్లి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు.


‘‘మా తెలంగాణ ప్రాజెక్టులు నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకం.. ఇవన్నీ నిండిన తరువాత నీళ్లు మిగిలితే..అక్కడి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయం. పోలవరం కోసం సీమాంధ్రలో కలపాలని చెప్పి ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మేం ప్రాజెక్టు యథాతథంగా కడతామంటే దానిని వ్యతిరేకిస్తాం. డిజైను మార్చాలని డిమాండ్ చేస్తున్నం. ఏడు మండలాలు ఖచ్చితంగా తెలంగాణలోనే ఉండాలే. సుప్రీంకోర్టుకు పోయి అయినా, ఉద్యమం చేసైనా సరే,  చివరిదాకా పోరాడతం. అక్కడ ఉన్న గిరిజనులను కాపాడతం. డిజైను మార్చకుండా ఆ ప్రాజెక్టును కట్టనీయం.తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ గవర్నమెంట్‌లో పనిచేయాలి. ఆంధ్ర ఉద్యోగులు వాళ్ల గవర్నమెంట్‌లో పనిచేయాలి.వేరే ఆప్షన్లు ఉండయి. చంద్రబాబూ.. ఇక్కడ కూడా నా గవర్నమెంట్ వస్తదంటున్నవు. నీ బొంద.. నీ గవర్నమెంట్ కాదు కదా, నెత్తి కొట్టుకున్నా ఈడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ధాంధీం అని మాట్లాడి, ఒక అబద్ధం నూరుసార్లు చెప్పి, ఏదో చేయాలని ప్రయత్నంలో ఉన్నడు. చంద్రబాబు మనకు కొట్టిన గుండు చాలదా? ఇంకా మనం బుద్ధి లేకుండా ఉన్నామా? మన తలరాత మనమే రాసుకోవాలి. చంద్రబాబు ఓయ్ ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు అని చెప్తుండు. జపాన్  పోయి వచ్చి జపాన్ చేస్తాన న్నాడు. చైనా పోయి వచ్చి చైనా చేస్తానన్నాడు. సింగ పూర్ పొయి వచ్చి సింగపూర్ చేస్తానన్నాడు. చివరకు ఆయనకు పిచ్చి లేచిపోయి స్క్రూ లూజ్ అయిపోయి మాట్లాడుతుండు. జపాన్, సింగ పూర్ కాలేదు కానీ, చంద్రబాబు మెంటల్ మాత్రం ఖరాబ్ అయింది. అన్నీ పిచ్చి కూతలు కూస్తున్నడు’’ అంటూ తనదైన శైలిలో, తనదైన స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు.