కాంగ్రెస్-తెరాస తలాక్! నమ్మొచ్చా?

 

కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం కాకపోవడానికి వంద కారణాలున్నాయని కేసీఆర్ నిన్న చెప్పారు. కేసీఆర్ చెప్పిన కారణాలేవీ నిన్న రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కావు. విభజన ప్రక్రియ మొదలయినప్పటి నుండే ఉన్నాయని ఆయనే చెప్పారు. తెలంగాణాకు తానే అడ్డుపడుతున్నానని టీ-కాంగ్రెస్ నేతల ప్రచారం చూసి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందేవరకు అన్ని అవమానాలు భరిస్తూ ఇంతకాలం వెనక్కి తగ్గానని చెప్పారు. అంటే, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకూడదని ముందే నిర్ణయించుకొన్నపటికీ బిల్లు ఆమోదం పొందేవరకు చర్చల పేరిట కాలక్షేపం చేసినట్లు ఆయనే స్వయంగా స్పష్టం చేసినట్లయింది. ఇప్పుడు తెలంగాణా ఏర్పడినట్లు అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయింది గనుక, ఇక విలీనం కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాని ఆపలేదని నిశ్చయం చేసుకొన్న తరువాతనే కేసీఆర్ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ తెగతెంపులు నిజంగా చేసుకోన్నారా? లేక కాంగ్రెస్-తెరాసల వ్యూహంలో భాగంగానే చేసుకొన్నారా? అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే, తెగతెంపులకి వంద కారణాలున్నాయని చెప్పిన కేసీఆర్ సరిగ్గా వారం రోజుల క్రితమే కాంగ్రెస్ అధిష్టానంతో విలీనంపై చర్చలు ముగించిన తరువాత, తన కుటుంబ సభ్యులందరినీ వెంటబెట్టుకొని సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఈ కారణాలు గుర్తుకు రాలేదంటే నమ్మశక్యం కాదు. అప్పుడు గుర్తుకు రాని ఈ కారణాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కాంగ్రెస్-తెరాసలు కలిసి ఆడుతున్న నాటకమని అనుమానించక తప్పదు. గత మూడునాలుగేళ్ళుగా ఉద్యమాలతో రాష్ట్రం అగ్ని గుండంగా మారి, రాష్ట్రంలో తీవ్ర అరాచక వాతావరణం ఏర్పడి ఉన్నపుడు ఏనాడు రాష్ట్రంలో అడుగుపెట్టని కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దమనిషి-జైరాం రమేష్, కేసీఆర్ వెనకే హైదరాబాద్ వచ్చి తెరాసను తన మాటలతో రెచ్చగొట్టడం చూస్తే ఈ రెండు పార్టీలు ఒట్టొట్టి తెగతెంపుల నాటకం మొదలుపెట్టాయని అనుమానం కలగకమానదు.