అధిష్టానంతో దోస్తీ, టీ-కాంగ్రెస్ తో ఖతరా!

 

నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టిపోసిన కేసీఆర్, ఇప్పుడు సోనియాగాంధీని మళ్ళీ దేవతని పొగుడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానిని చేసేందుకు యూపీఏకి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ అడగక ముందే ప్రకటించేశారు కూడా. అందుకు ప్రతిగా ఆయన రాష్ట్రంలో టీ-కాంగ్రెస్ మద్దతు అవలీలగా పొందవచ్చును. కానీ, ఆయన టీ-కాంగ్రెస్ మట్టికొట్టుకు పోతుందని శాపనార్ధాలు పెడుతున్నారు.

 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెపుతున్న కేసీఆర్, రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవులన్నీ తనకు, తన కుటుంబ సభ్యులకే దక్కించుకోవాలనే పదవీ కాంక్షే వలననే. టీ-కాంగ్రెస్ మద్దతు తీసుకొంటే వారికీ అధికారంలో భాగం పంచి, కీలక పదవులు ఈయవలసి ఉంటుంది. అదే వైకాపా, మజ్లిస్, సీపీయం, వంటి ఇతర పార్టీల నుండి మద్దతు తీసుకొంటే, వారికి ఏవో అప్రధాన్య పదవులు పడేసి, ముఖ్యమయిన పదవులన్నీ తామే స్వంతం చేసుకోవచ్చును.

 

కానీ, దేశముదురు టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కి అధికారం దక్కనిస్తారని నమ్మకం లేదు. చిరకాలంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నజానారెడ్డి, జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వంటి వారందరూ తమకు ఇప్పుడు ఆ అవకాశం దక్కకపోయినా, కనీసం అధికారం తమ పార్టీ చేజారకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలపై అవసరానికి మించి ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, టీ-కాంగ్రెస్ నేతలపై, ముఖ్యంగా పొన్నాలపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు.

 

కేసీఆర్ అధికారం దక్కించుకోకుండా అడ్డుకొనేందుకు టీ-కాంగ్రెస్-తెదేపాలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఆ భయంతోనే చంద్రబాబు, పొన్నాల, తదితరులపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. జగన్, అసదుద్దీన్, రాహుల్ గాంధీ వంటి వారివల్ల తనకు అవసరం ఉంది, పైగా వారి వల్ల తనకు ఎటువంటి సమస్య ఉండబోదు గనుకనే వారికి కేసీఆర్ బాకా ఊదుతున్నారు.