కేసీఆర్ ఆరాటమంతా జగన్ మద్దతు కోసమేనా?

 

సాధారణంగా ఓటమి భయం ఉన్నవారే ‘తమ గెలుపు తధ్యం’ అని పదేపదే బిగ్గరగా చెప్పుకొంటారు. సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు ఆవిధంగా చెప్పుకోవడం లేదు. అంటే రెండు పార్టీలకు తమ గెలుపుపై పూర్తి భరోసా ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ, తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్, తెరాసలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని పోటీలు పడి మరీ చెప్పుకొంటున్నాయి. కేసీఆర్, పొన్నాల ఇరువురూ తామే అధికారంలోకి వస్తామని పైకి చెప్పుకొంటునప్పటికీ, ఇతర పార్టీల యం.యల్యే.లకు గాలం వేయడానికి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మురం చేసారు. తెరాసకు చెందిన 20మంది గెలుపు గుర్రాలు తనతో టచ్చులో ఉన్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రకటనే అందుకు ఒక ఉదాహరణ. ఆయన ఆవిధంగా ప్రయత్నించడాన్ని తప్పు పట్టిన కేసీఆర్ కూడా ఇతర పార్టీల యం.యల్యే.ల మద్దతు కూడ గట్టే పనిలో పడ్డారు.

 

బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ నిన్న జగన్మోహన్ రెడ్డికి కూడా బాకా ఊదినట్లున్నారు. జగన్ను ప్రసన్నం చేసుకోనేందుకే ఆయనకు బద్ద శత్రువయిన చంద్రబాబుకి శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తెలంగాణా నుండి బిచాణా ఎత్తివేసినప్పటికీ, తెలంగాణాలో సీమాంధ్ర ప్రజలు స్థిరపడిన ప్రాంతాలలో తెరాసకు గెలిచే అవకాశం ఉండబోదు గనుక అక్కడ తన పార్టీని పోటీలో దింపారు. కనుక తెలంగాణాలో కూడా వైకాపా కనీసం 4-6 యం.యల్యే. సీట్లు సాధించుకొనే అవకాశం ఉంది. బహుముఖ పోటీ కారణంగా తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ లకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అటువంటప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ప్రతీ ఒక్క యం.యల్యే. మద్దతు అమూల్యమే. అందుకే జగన్ కూడా అంటరాని వాడు కాదని కేసీఆర్ లౌక్యంగా మనసులో మాట బయట పెట్టారు. అంటే మిగిలిన తెలంగాణా పార్టీలతో బాటు తెలంగాణాను వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు చేసిన వైకాపా మద్దతు తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారని స్పష్టమవుతోంది. ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా కేసీఆర్ ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యేందుకు మళ్ళీ అదే సీమాంధ్ర నేత, పార్టీ మద్దతు ఆశించడం హాస్యాస్పదం.