కేటీఆర్ ఆనారోగ్యం : టీఆర్ఎస్‌లో ఆందోళన

 

తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ తరచుగా అనారోగ్యంపాలు అవుతూ వుండటం పట్ల టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వున్నారు. గురువారం ప్రచారంలో వున్న ఆయనకి అకస్మాత్తుగాకడుపునొప్పి రావడంతో బాగా ఇబ్బందిపడ్డారు. ఆయన కడుపునొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకులు ఆయన్ని వెంటనే సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు కేటీఆర్‌ని తక్షణం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తే మంచిదని సూచించారు. అంతలోనే కేటీఆర్ కడుపునొప్పి తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్‌కి బయలుదేరలేదు. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే ఒక పదిహేను రోజుల క్రితం కేటీఆర్‌కి హైదరాబాద్‌లో వుండగా అర్థరాత్రి సమయంలో భారీగా కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆయన్ని హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. ఆ తర్వాత కొన్నిరోజులు ఆయన బయట కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు భారీగా కడుపునొప్పి వచ్చింది. కేటీఆర్‌కి ఇలా చీటికిమాటికి కడుపునొప్పి వస్తూ వుండటం పట్ల టీఆర్‌ఎస్ వర్గాలు ఆందోళనపడుతున్నాయి.