కేసీఆర్ ఇంట్లో ఈ లొల్లేంది

 

ఇప్పటికీ అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ కి ఇప్పుడు స్వయాన్నతన అన్న కూతురే తనపై మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేయడం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలయిన వేగులపాటి రమ్య కొద్ది వారాల క్రితం తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో, కేసీఆర్ ఇంటి ముందు 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' అనే ఒక నిరసన కార్యక్రమం చెప్పట్టాలనుకొన్నారు. దానికోసం ఒక పోస్టర్‌ కూడా సిద్దం చేసి దానిని విడుదలకు జరిపిన ఒక సభలో, ఆమె తన పెదనాన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. దానికి ఆగ్రహించిన తెరాస మహిళా నేతలు కరీంనగర్ లో రమ్యకు చెందిన ఒక ఫంక్షన్ హాలుపై దాడి చేసి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.

 

రమ్య మొన్ననే ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పిర్యాదు కూడా చేశారు. ఈ రోజు ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, తనకు తన కుటుంబానికి కెసిఆర్ మరియు తెరాస కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆమె పిర్యాదుని స్వీకరించిన మానవ హక్కుల సంఘం ఈ అంశంపై వచ్చే నెల 8వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ పోలీసు సుపరెండేంట్ కు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇది టీకప్పులో తుపానులా త్వరలోనే సమసిపోవచ్చును, కానీ ఈ సంఘటన కేసీఆర్ కుటుంబకలహాలను బయట పెట్టింది.