కేసీఆర్ దురాశే కొంప ముంచిందా

 

తెలంగాణా ఉద్యమం పేరిట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో జవహార్ లాల్ నెహ్రు నుండి నేటి రాహుల్ గాంధీ వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా అందరిని దుమ్మెత్తిపోసాడు. కానీ, మొన్న జరిగిన టీ-కాంగ్రెస్ నేతల సభలో కాంగ్రెస్ నేతలందరూ ఏక త్రాటిపైకి రావడం, వారందరూ ముక్తకంఠంతో కాంగ్రెస్ ద్వారానే తెలంగాణా సాధ్యమని ప్రకటించిన మరునాడే దిగ్విజయ్ సింగ్ పది రోజుల్లో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ప్రకటించడంతో కేసీఆర్ కంగు తిన్నాడు.

 

తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ డిల్లీలో నెల రోజులు తిష్ట వేసిన కేసీఆర్, నాడు కాంగ్రెస్ పార్టీకి అనేక షరతులు విదించాడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, తనకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలని, టికెట్స్ పంపిణీ మొత్తం తన చేతుల మీదుగా తనకు నచ్చిన వారికి ఇచ్చుకొనే స్వేచ్చ ఉండాలని, తను కోరుకొన్న వ్యక్తులకు కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు ఇచ్చుకొనెందుకు పార్టీ అంగీకరించాలని వగైరా, వగైరా షరతులు చాలానే విధించాడు. అయితే వాటిలో కొన్నిటికి కాంగ్రెస్ సమ్మతించినప్పటికీ, మరి కొన్నిటికి సమ్మతించక పోవడంతో కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చేసి ఉద్యమం తీవ్ర తరం చేసాడు.

 

ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా తారుమారయింది. ఆయనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దపడినా, కాంగ్రెస్ నేతలు ‘మాకొద్దు పొమ్మంటున్నారు.’ కేసీఆర్ ని లోపలికి రానిస్తే అతను పార్టీకి గుదిబండగా మారి తలనొప్పులు సృష్టిస్తాడని చాల మంది టీ-కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో, తెరాస ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటరానిదయిపోయింది.

 

నిన్న మొన్నటి వరకు తమకు సోనియమ్మ కనీసం అపాయింటు మెంటు కూడా ఈయకుండా హీనంగా చూస్తోందని వాపోయిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తెలంగాణా మేమే ఇస్తామని దృడంగా, ఆత్మవిశ్వాసంతో చెపుతుంటే, తెరాస నేతలు విస్తుపోయి చూస్తున్నారు.

 

తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం జరుగుతున్నది చూడటం కంటే మేము చేయగలిగింది ఏమి లేదు,” అన్నారు.

 

“ఒకనాడు మా పార్టీని కాంగ్రెస్ లో కలుపుకోవాలని వాళ్ళు చాలా ఆరాటపడ్డారు. కానీ, ఇప్పుడు మేమే తెలంగాణా ఇస్తామని చెపుతూ, మాతో కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాతో డబుల్ గేం ఆడి మోసం చేసినట్లు మేము భావిస్తున్నాము. ఇక, కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేనప్పుడు, మేము కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దపడాల్సిందే,” అని కేటీఆర్ అన్నారు.

 

ఇది ఇలాగుంటే, మీడియాలో వస్తున్న వార్తా విశ్లేషణలు తెరాసను మరింత క్రుంగ దీస్తున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్ నేతలకు వలేసి పట్టేసామని భ్రమలో ఉన్న కేసీఆర్, వారు ముగ్గురూ కూడా కాంగ్రెస్ పంపిన బంటులేనని, తానూ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తానని ప్రగల్భాలు పలుకుతుంటే అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీయే తన మనుషులను తెరాసలోకి జొప్పించి, కేసీఆర్ తన వ్రేలితో తన కన్నుపొడుచుకొనేలా చేసిందని, వారు పార్టీకి రాజీనామాలు చేసివచ్చినా సాంకేతికంగా ఇప్పటికీ కాంగ్రెస్ యంపీలేనని, తెలంగాణా ప్రకటించిన మరుక్షణం వారు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం ఖాయమని కొందరు తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

ఇంత కాలం తెలంగాణా కోసం ఉద్యమాలు చేసి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఊహించని విధంగా ఎత్తుకుపోతుంటే కేసీఆర్ కి ఏమిచేయాలో పాలు పోవడంలేదు. కాంగ్రెస్ గనుక త్వరలో తెలంగాణా ప్రకటన చేసినట్లయితే, ఇక టీ-కాంగ్రెస్ నేతలను తట్టుకోవడం తన వల్ల కాదనే సంగతి కూడా అర్ధం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం మాట దేవుడెరుగు, ఇక తెరాస నుండి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయితే దానిని ఆపడం సాద్యమా? అనే ఆలోచన ఆయనకు భయం కలిగిస్తోంది.